సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చరిత్రలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కళాశాలలో లా విద్యను అభ్యసించే రోజుల్లో క్లాస్‌మేట్స్‌గా ఉన్న నలుగురు విద్యార్థులు నేడు దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమితులై సరికొత్త రికార్డును సృష్టించారు. ఈనెల 19న సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులైన విషయం తెలిసిందే. వీరిలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్‌వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు ఉన్నారని న్యాయశాఖ ప్రకటించింది. వీరు త్వరలోనే ప్రమాణం చేయనున్నారు. అయితే ఎస్‌ఆర్ భట్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు.. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న డీవై చండ్రచూడ్, ఎస్‌కే కౌల్‌లు కాలేజీ నాటి స్నేహితులు. ఒకే ఏడాది లా పట్టా పుచ్చుకున్నారు. వీరి స్నేహ ప్రయాణం 37 ఏళ్ల నాటి నుంచి కొనసాగుతోంది.
ఢిల్లీ యూనివర్సిటీలో వీరు నలుగురు 1982లో నుంచి ఒకే ఏడాది లా పరీక్షలో ఉత్తీర్ణులైనారు. వీరిలో డీవై చండ్రచూడ్, ఎస్‌కే కౌల్ ముందుగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కాగా.. తాజాగా ఎస్‌ఆర్ భట్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లకు కొంత ఆలస్యంగా ఈ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని వీరి నలుగురికి కామన్ ఫ్రెండ్ అయిన శివరామ్ సింగ్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఈ పరిణామం చాలా అరుదైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు యూనివర్సిటీ రోజుల్లో వీరంతా ముందే బెంచ్‌లోనే కూర్చునేవారని.. తాజాగా సుప్రీంకోర్టు బెంబ్‌లోనూ (న్యాయమూర్తులుగా) సీట్లు పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వీరిలో డీవై చండ్రచూడ్ 1959లో జన్మించగా.. 2000లో తొలిసారి ముంబై హైకోర్టు అడిషనల్ జడ్జ్‌గా నియమితులైనారు. ఆ తరువాత 2013లో ఆలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించి అనంతరం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టాపొందిన జస్టిస్ ఎస్‌ఆర్ భట్ 1958లో జన్మించారు. 1982లో ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2004లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.
జస్టిస్ హృతికేరాయ్ 1960లో జన్మించి.. 1980లో లా పట్టా పొందారు. 2006లో గుజరాత్ అడీషనల్ జడ్జ్‌గా నియమితులై.. 2008లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం గౌహతి, కేరళ హైకోర్టులకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2018లో కేరళ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.
జస్టిస్ సజయ్ కృష్ణకౌల్.. తొలుత ఢిల్లీ హైకోర్టులో అడీషనల్ జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. అక్కడి నుంచి 2013లో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు. 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. దీంతో నాటి స్నేహితులు నేడు సుప్రీంకోర్టు బెంచ్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment