స్టెంట్ల కొరత సృష్టిస్తే లైసెన్సులు రద్దు
కేంద్రమంత్రి అనంతకుమార్
బనశంకరి (బెంగళూరు): గుండె శస్త్ర చికిత్సలో ఉపయోగించే స్టెంట్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఔషధ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ హెచ్చరించారు. స్టెంట్ల ఉత్పత్తి గతంలో మాదిరిగానే కొనసాగాలని స్పష్టం చేశారు. స్టెంట్ ధర తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయమా? కాదా? అనే అంశంపై శుక్రవారం బెంగళూరులో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు.
తగ్గించిన ధరలు ఈ నెల 13 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయన్నారు. సాధారణ స్టెంట్ (మెటల్‌స్టెంట్) మార్కెట్‌లో రూ.40 వేల నుంచి రూ. 50 వేలకు విక్రయించేవారని, ఇకపై రూ.7,260 కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ప్రత్యేక స్టెంట్లు రూ.లక్షా 70 వేలకు విక్రయించేవారని, ఇకపై వీటిని రూ.29,600 కంటే అధిక ధరకు విక్రయించరాదన్నారు. నియమాలు ఉల్లంఘించిన సంస్థల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.