
కేంద్రమంత్రి గిరిరాజ్‌పై కేసు
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది.
ముజఫర్‌పూర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది. సంజయ్‌సింగ్ అనే కాంగ్రెస్ కార్యకర్త వేసిన పిటిషన్‌పై గురువారం స్థానిక కోర్టు స్పందిస్తూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా గిరిరాజ్ సింగ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. న్యూఢిల్లీలోని గిరిరాజ్ ఇంటి వద్ద, బీజేపీ కేంద్రకార్యాలయం దగ్గర యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న బెంగళూరులోనూ కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌యూఐ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.
కేంద్ర మంత్రి మండలి నుంచి గిరిరాజ్‌ను తక్షణం తప్పించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, తరువాత క్షమాపణలు చెప్పటం రివాజుగా మారిందని ఢిల్లీ ప్రదేశ్ మహిళాకాంగ్రెస్ నేత ఓనికా మెహ్రోత్రా అన్నారు. కాగా, గిరిరాజ్ సింగ్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినందున ఇక ఆ వ్యవహారం ముగిసినట్లేనని బీజేపీ పేర్కొంది. దీనిపై ప్రత్యర్థులు రాద్ధాంతం చేయటం తగదని పార్టీ అధికార ప్రతినిధి షాన్‌వాజ్ హుస్సేన్ బెంగళూరులో అన్నారు.