ఇస్రో మాజీ చైర్మన్‌పై చార్జ్‌షీట్
‘యాంత్రిక్స్-దేవాస్’ కేసులో నాయర్‌తో పాటు పలువురి పేర్లు
కేబినెట్‌తో పాటు అంతరిక్ష కమిషన్‌ను మోసగించారన్న సీబీఐ
న్యూఢిల్లీ: యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం కేసులో ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై గురువారం సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రైవేట్ మల్టీమీడియా కంపెనీ దేవాస్‌కు ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ రూ. 578 కోట్ల మేర అక్రమంగా లబ్ధి చే కూర్చినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నాయర్‌తో పాటు అప్పటి యాంత్రిక్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె.ఆర్.శ్రీధర్ మూర్తి, దేవాస్ సీఈవో రామచంద్ర విశ్వనాథన్(ఫోర్జ్ అడ్వైజర్స్ మాజీ ఎండీ), దేవాస్ డెరైక్టర్ ఎం.జి.చంద్రశేఖర్‌ల పేర్లను అభియోగ పత్రంలో చేర్చారు.
ఢిల్లీలోని సంబంధిత కోర్టులో సమర్పించిన ఈ చార్జ్‌షీట్‌లో అంతరిక్ష విభాగం అదనపు కార్యదర్శి వీనా ఎస్ రావు, ఇస్రో అప్పటి డెరై క్టర్ ఎ.భాస్కర్ నారాయణరావు, దేవాస్‌కి చెందిన ఇద్దరు డెరైక్టర్లు డి.వేణుగోపాల్, ఎం.ఉమేశ్ పేర్లనూ పేర్కొన్నారు. మోసానికి పాల్పడినందుకు ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, అధికార దుర్వినియోగంతో తమకు, ఇతరులకు అక్రమ లబ్ధి చేకూరేలా వ్యవహరించినందుకు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నేరానికి పాల్పడినట్లు ఆరోపించింది. జీశాట్-6, జీశాట్-6ఏ ఉపగ్రహాలు, భారత భూ భాగంలోని వ్యవస్థల ద్వారా ఎస్-బ్యాండ్ సాయంతో మొబైల్ ఫోన్లకు వీడియోలు, మల్టీమీడియా వివరాలు, సమాచార సేవల్ని పంపేందుకు దేవాస్‌ను అనుమతించేలా అధికార దుర్వినియోగం చేశారంది.
వివరాల్ని తొక్కిపెట్టారు: ఎస్-బ్యాండ్ తరంగాలు కావాలంటూ రక్షణ, టెలికం శాఖలు కోరాయన్న అంశాలపై విచారణ కొనసాగుతుందని సీబీఐ తెలిపింది. ‘మే, 26 2005న అంతరిక్ష కమిషన్ 104వ సమావేశంలో జీశాట్-6/ఇన్సాట్-4ఈ కోసం రూ.269 కోట్ల బడ్జెట్ సాయం చేయాల్సిందిగా ఇస్రో కోరింది. అప్పటికే దేవాస్‌తో ఒప్పందం చేసుకున్నా ఆ విషయాన్ని వెల్లడించలేదు. నవంబర్ 17, 2005న జీశాట్-6 నిర్మాణం కోసం కేబినెట్‌కు నోట్ సమర్పించారు. ఒప్పందంపై కేబినెట్‌కు తప్పుడు సమాచారమిచ్చారు.
డిసెంబర్, 2005న కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని పేర్కొంది. ఒప్పందాన్ని యాంత్రిక్స్ రద్దు చేసుకోవడంపై అంతర్జాతీయ ట్రిబ్యునల్లో కేసును భారత్ ఓడిపోయిన నెల తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేయడం గమనార్హం. కేసు ఓటమితో పరిహారం కింద దేవాస్ రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
దేని ఆధారంగా దాఖలు చేశారు?: నాయర్
ఏ ఆధారంగా కేసు దాఖలు చేశారో నిజానికి తనకు అర్థంకావడం లేదని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. ‘ఈ అంశంపై ఇంతకుముందు చతుర్వేది, ప్రత్యూష్ సిన్హా కమిటీలు విచారించి.. ప్రభుత్వానికి నష్టం జరగలేదని నిర్ధారణకు వచ్చాయి. అయినా సరే ఆ సమయంలో నలుగురు శాస్త్రవేత్తల్ని శిక్షించారు. నాలుగేళ్ల అనంతరం అదే అంశంపై కోర్టులో కేసు ఎలా దాఖలు చేస్తారో అర్థంకావ డం లేదు’ అని అన్నారు.