సాక్షి, న్యూఢిల్లీ : బోఫోర్స్ ముడుపుల కేసులో నిందితులపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చుతూ 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో హిందుజా సోదరులు సహా నిందితులందరినీ నిర్ధోషులుగా పేర్కొంటూ 2005, మే 31న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే 12 ఏళ్ల జాప్యం తర్వాత బోఫోర్స్ కేసుపై అప్పీల్‌కు వెళ్లడానికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ విముఖత చూపుతూ చేసిన సూచనల నేపథ్యంలో సీబీఐ ఈ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీబీఐ తన వాదనకు మద్దతుగా చూపిన కీలక పత్రాలు, ఆధారాలతో న్యాయనిపుణులు సంతృప్తి వ్యక్తం చేయడంతో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసేందుకు దర్యాప్తు సంస్థ సుప్రీంను ఆశ్రయించిందని సమాచారం. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం తలుపుతడితే న్యాయస్ధానం పిటిషన్‌ను తోసిపుచ్చవచ్చంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. బోఫోర్స్ కేసులో అవినీతి నిరోధక చట్టం, మోసం, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలతో ఏబీ బోఫోర్స్ అప్పటి అధ్యక్షుడు మార్టిన్ అర్డ్బో, దళారీ విన్‌చద్దా, యూరప్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు హిందుజా సోదరుపలై 1990, జనవరి 22న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment