
సీబీఎస్‌ఈ పది పరీక్షలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న క్రమంలో సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు సీబీఎస్‌ఈ ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించబోమని బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని నిశితంగా పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా పది, పన్నెండో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తారని గతంలో వచ్చిన వార్తలను సీబీఎస్‌ఈ తోసిపుచ్చింది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని గతంలో ప్రకటించిన సీబీఎస్‌ఈ బోర్డు తాజాగా పదో తరగతి పెండింగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.