తప్పుదోవ పట్టిస్తే సెలబ్రిటీలకు ఐదేళ్ల జైలు!
- ప్రకటనలపై వినియోగదారుల చట్టంలో కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల్లో నటించినట్లయితే.. ఐదేళ్ల జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించాలని కొత్త ముసాయిదా చట్టం చెప్తోంది. ముప్పై ఏళ్ల కిందటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2015ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పార్లమెంటరీ స్థాయీ సంఘం గత ఏప్రిల్‌లో తన సిఫారసులను సమర్పించింది.
వీటిని అధ్యయనం చేసిన వినియోగదారుల మంత్రిత్వశాఖ.. సెలబ్రిటీలను బాధ్యులను చేయటం, కల్తీకి కఠిన శిక్ష విధించటం వంటి కొన్ని కీలక సిఫారసులను ఆమోదించింది. ఈమేరకు ముసాయిదా బిల్లులో చేయదలచుకున్న మార్పులపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సారథ్యంలో కేంద్ర మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీలో సమావేశమై చర్చించనుంది. అనంతరం వీటిని కేబినెట్ ఆమోదం కోసం మంత్రివర్గానికి నివేదిస్తారు.
వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటనల్లో పాల్గొనే ప్రముఖులకు.. ఆయా ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి రూ. 10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష.. రెండోసారి, ఆపైన అదే నేరానికి రూ. 50 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని ముసాయిదాలో నిబంధనలు చేర్చినట్లు ప్రభు త్వ వర్గాలు తెలిపాయి. అలాగే కల్తీ విషయంలో కూడా ఇదే తరహా శిక్షలతో పాటు.. లెసైన్స్ రద్దు చేయ టం వంటి చర్యలను సిఫారసు చేసినట్లు సమాచారం.