
ప్రసంగిస్తున్న ధూర్జటీదాస్, హాజరైన ప్రజలు
జయపురం : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని సోషలిస్టు యూనిటీ సెంటర్ ఫర్ ఇండియా (ఎస్‌యూసీఐ) ఆరోపించింది. జయపురం సబ్ డివిజన్‌లోని బొయిపరిగుడలో పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యదర్శి సూర్యనారాయణ బిశాయి, రాష్ట్ర కార్యదర్శి ధూర్జటిదాస్ మాట్లాడుతూ దేశ రాజకీయ పరిస్థితులపై పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఎన్‌డీఏ పాలకులు దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నాయని ఆరోపించారు. దీంతో దేశ ప్రజలు తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారని వివరించారు. దేశంలో 5 శాతం ఉన్న పెట్టబడిదారులు కార్మికులను దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందన్న నెపంతో కొంతమంది రాజకీయ నాయకులు దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా పెట్టుబడిదారులకు సహకరిస్తూ ప్రజా ప్రయోజనాలను తుంగలో తొక్కుతోందని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేడీ, కేంద్రంలో బీజేపీ ప్రజలను నిరంతరం మోసగిస్తున్నాయని విమర్శించారు.
బీజేపీ నిత్యం మతతత్వంతో ప్రజలను రెచ్చగొడుతూ దేశ సమగ్రతకు తూట్లు పొడుస్తోందన్నారు. దేశంలో ప్రస్తుతం అశాంతి పరిస్థితులు నెలకొనడానికి బీజేపీయేనని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై యువత, ప్రజలు పెద్ద ఎత్తున పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రామికులు, విద్యార్థులు, రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం నవంబర్‌లో జరగనున్న ఎస్‌యూసీఐ పార్టీ జాతీయ సమ్మేళనానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు సదాశివ దాస్, జిల్లా కార్యదర్శి బిశ్వాల్, నాయకులు రామ్‌నాయక్, లక్ష్మినాయక్, వాసుదేవ్ ఖొర, దాశరథి ఖిలో, నరేంద్ర ఖిలో, రామ గదబ, రవీంద్ర పండా, సుర్జిత్ స్వంయి, బాసంతి ఖొర, ప్రమీల పూజారి, రుక్మిణీ బారిక్‌తో పాటు బొయిపరిగుడ, కుంద్ర, జయపురం ప్రాంతాల కార్యకర్తలు పాల్గొన్నారు.