
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టిందని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులకు ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా త్వరలో జిల్లాల వారీగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
80 కోట్ల మందికి ప్రత్యేక రేషన్ ద్వారా రూ 3 కే కిలో బియ్యం, రూ 2 కే కిలో గోధుమలు సరఫరా చేస్తామని చెప్పారు. ప్రజలకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయని, పాలు నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచిఉంటాయని తెలిపారు. ప్రజలంతా క్రమశిక్షణతో మెలుగుతూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ భరోసా ఇచ్చారు.
ఇక మహమ్మారి వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు మూడు వారాల పాటు దేశమంతటా లాక్‌డౌన్ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకూ దేశమంతటా లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. దీంతో అత్యవసర సేవలు మినహా దేశమంతా షట్‌డౌన్‌లోకి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment