♦ హోం మంత్రితో భేటీ అనంతరం వెల్లడించిన జగన్
♦ చంద్రబాబు పాలనపై ఆయనకే నమ్మకం లేదు
♦ అందుకే ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించడం లేదు
♦ ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓట్లు వేస్తారనే నమ్మకం ఆయనకు లేదు
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని తాము చేసిన విజ్ఞప్తికి హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుంభకోణాలను ఆధారాలు, జీవోలతో సహా ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ పుస్తకంలో పేర్కొన్న అంశాలపై సీబీఐ విచారణ చేయించాలని తాము విజ్ఞప్తి చేశామని తెలిపారు.
అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును హోం మంత్రికి వివరించానని చెప్పారు. ఈ అంశం మీదా విచారణకు ఆదేశించాలని కోరామన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల బృందం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను మంగళవారం ఆయన నివాసంలో కలిసింది. పార్టీ ప్రజాప్రతినిధుల బృందానికి హోం మంత్రి దాదాపు అరగంట సమయం కేటాయించారు. అనంతరం హోం మంత్రి నివాసం వెలుపల విపక్ష నేత జగన్ విలేకరులతో మాట్లాడుతూ ఏమన్నారంటే...
డ్వాక్రా అక్కచెల్లెమ్మలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా మోసం చేశారో చెప్పాం. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలిస్తామని, ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఏ రకంగా మోసం చేశారో వివరించాం. సమాజంలోని అన్ని వర్గాలను అన్ని రకాలుగా బాబు మోసం చేసిన తీరును తెలిపాం. మోసాల ఫలితంగా నెలకొన్న ప్రజల కోపాగ్ని నుంచి దృష్టి మరల్చడానికి.. అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసి మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును వివరించాం. అవినీతి సొమ్ముతో కొనుగోలు చేయడంతో పాటు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే అంశం మీద విచారణ చేయించమని విజ్ఞప్తి చేశాం.
ఆధారాలతో సహా ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ పుస్తకంలో పేర్కొన్న కుంభకోణాలపైనా సీబీఐ విచారణకు ఆదేశించమని కోరాం. ‘పట్టపగలు ఇంతింత డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఉండదు. ప్రశ్నించాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా ప్రశ్నించకపోవడం అన్యాయం. కచ్చితంగా ఈ అంశాల మీద విచారణ జరిపించాలి’ అని విన్నవించాం. మా వినతులపై హోం మంత్రి సానుకూలంగా స్పందించారు. ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ పుస్తకాన్ని బాగా తిరగేశారు. అన్ని అంశాలను పరిశీలించారు, చదువుకున్నారు.
విభజన హామీలు నెరవేర్చమని కోరాం
రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు... ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం.. తదితర హామీలను నెరవేర్చమని హోం మంత్రికి వినతిపత్రం సమర్పించాం. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్ ఏర్పాటు హామీలను నెరవేర్చమని కోరాం. ప్రత్యేక హోదాకు బదులుగా డీలిమిటేషన్ చేయమని చంద్రబాబు అడిగితే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.
సొంత పాలనపై బాబుకు నమ్మకం లేదు
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన బాబు ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పచ్చకండువా కప్పుతున్నారు. తన పాలనపై నమ్మకం లేని పరిస్థితుల్లో దిగజారుడు పనులు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి లేదా అనర్హులుగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లకుండా మోసం చేస్తున్నారు. ప్రలోభపెట్టి తీసుకున్న ఎమ్మెల్యేలను ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ ఓట్లు వేయిస్తామనే నమ్మకం లేకే వారితో రాజీనామా చేయించడం లేదు.
బాబుపై సీబీఐ విచారణకు కేంద్రం సానుకూలం
Published Wed, Apr 27 2016 3:29 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement