సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసి, దాన్ని రెండు ముక్కలుగా విభజించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఓ రాష్ట్రం హక్కులను హరించి వేసిందని, తద్వారా ప్రభుత్వ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచిదంటూ కొందరు రాజ్యాంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలైనా తీవ్రంగా పరిగణించకపోతే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క కశ్మీరే కాదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను క్రమేణ హరించి వేస్తోంది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్
దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తీసుకొచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ చట్టాన్ని సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును జూలై 15వ తేదీన లోక్‌సభ, ఆ తర్వాత రెండు రోజులకు రాజ్యసభ ఆమోదించింది. ఇంతవరకు టెర్రర్ కేసుల దర్యాప్తునకు మాత్రమే పరిమితమైన ఈ సంస్థకు మానవులు అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, నిషేధిత ఆయుధాల తయారీ, అమ్మకాలు, సైబర్ టెర్రరిజమ్‌తోపాటు 1908 పేలుడు పదార్థాల చట్టం పరిధిలోకి వచ్చే కేసులను దర్యాప్తు జరిపే అధికారాన్ని చట్ట సవరణ ద్వారా ఎన్‌ఐకేకు కట్టబెట్టారు. అంతేకాకుండా చట్టంలోని మూడవ సెక్షన్‌ను సవరించడం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసులకు పరిమితమైన విధులు, బాధ్యతలు, ప్రత్యేకాధికారాలు ఎన్‌ఐఏకు దఖలు పరిచారు. అంటే వారు ఏ రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేయాలకున్నా ఏ రాష్ట్ర అధికారి అనుమతి లేకుండా నేరుగా అరెస్ట్ చేయవచ్చు. ఈ బిల్లును కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ముందుగా తీవ్రంగా వ్యతిరేకించాయి. దీని వల్ల రాష్ట్రాలు హక్కులు కోల్పోవాల్సి వస్తోందని, సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని అధిక్షేపించాల్సిన ఆ పార్టీలు ఎన్‌ఐఏకు తిరుగులేని అధికారాలు సంక్రమించడం వల్ల అన్యాయంగా ముస్లింలు టార్గెట్ అవుతారని ఆరోపించాయి. చివరకు బిల్లుకు అనుకూలంగానే ఓటు వేశాయి
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం
‘అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివేన్షన్ యాక్ట్’ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించిన వారం రోజులకు, అంటే ఆగస్టు రెండవ తేదీన లోక్‌సభ ఆమోదించింది. ఇంతకుముందు ఈ చట్టం టెర్రరిస్టు సంస్థలకు మాత్రమే టెర్రరిస్టు స్వభావం ఉంటుందని పరిగణించేది. ఇప్పుడు సవరణ ద్వారా వ్యక్తులకు కూడా టెర్రరిస్టు స్వభావం ఉంటుందని, వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు అవకాశం ఇచ్చింది. అనుమానిత టెర్రరిస్టులను అరెస్ట్ చేయాలన్నా, వారి ఆస్తులను జప్తు చేయాలన్న ఇంతకుముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్సుడు దీన్ని సవరించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏ అనుమానితుడినైనా అరెస్ట్ చేయవచ్చు, అతని ఆస్తులను నేరుగా జప్తు చేయవచ్చు. ఈ చట్టం కింద విరసం సభ్యుడు వరవరరావు సహా లాయర్లు, రచయితలైన పలువురు సామాజిక కార్యకర్తలను కేంద్రం అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ చట్టం కింద ఎవరినైనా బెయిల్ రాకుండా ఏళ్లపాటు నిర్బంధించవచ్చు. భూమి అనే అంశం రాష్ట్రం పరిధిలోకి వస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలంటూ కొన్ని ప్రతిపక్షాలు వాదించాయి. అయితే టెర్రరిస్టులకు సామాన్యంగా తానుంటున్న రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే ఆస్తులు ఉంటున్నాయంటూ ప్రభుత్వం చేసిన వాదనతో చివరకు ఆ పక్షాలు వేధించాయి.
ఆర్టీఐ చట్టం సవరణ కూడా..
పార్లమెంట్ గత వారం ఆమోదించిన సమాచార హక్కు సవరణ చట్టం విషయంలోను అదే జరిగింది. ఇంతకుముందు వీరి పదవీ కాలం నిర్దిష్టంగా ఐదేళ్లు, గరిష్టంగా 65 ఏళ్ల వయస్సు ఉండగా, సవరణ ద్వారా వారి పదవీకాలం, వాళ్ల జీతభత్యాలకు ఇక నుంచి కేంద్ర ప్రభుత్వమే ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. రాష్ట్ర సమాచార కమిషనర్ ఎవరిని నియమించడం అన్నా, తొలగించడం అన్న కేంద్రం పరిధిలోనే ఉంటుంది.
డ్యామ్‌లు భద్రతా బిల్లు
రాజ్యాంగం ప్రకారం జలాల అంశం రాష్ట్రం పరిధిలోకి వస్తోంది. దీన్ని క్రమంగా కేంద్రం పరిధిలోకి తీసుకురావాలనే సంకల్పంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జూలై 29వ తేదీన ‘డ్యామ్ సేఫ్టీ బిల్’ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తమిళనాడు పాలకపక్షం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో బిల్లును ఇంకా ఓటింగ్‌కు తీసుకరాలేదు. దేశంలోని అన్ని డ్యామ్‌ల భద్రత కోసం ‘నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ’ని ఏర్పాటు చేయాలని బిల్లు సూచిస్తోంది. ఈ కమిటీ డ్యామ్‌ల నిర్వహణ, భద్రత పర్యవేక్షిస్తోంది. ఈ పేరట రాష్ట్రానికి చెందిన జలాల హక్కులను కూడా కేంద్రం లాగేసుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కేంద్రానికి లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉండడంతో ఏకపక్షంగా ఇలాంటి బిల్లులను తీసుకొస్తోంది. తద్వారా రాష్ట్రాల హక్కులు హరించుకుపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment