కూలిన శిథిలాల నుంచి 72 గంటల పాటు మృత్యువుతో పోరాడి క్షేమంగా బయటపడ్డ 28 ఏళ్ల ప్రకాశ్ రౌత్ కథ ఇది.
కేంద్రపరా (ఒడిశా): చెన్నైలో 11 అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒడిశాకు చెందిన ఓ కూలీ చనిపోయాడని గుర్తించారు. మృతదేహాన్ని అతడి స్వస్థలానికి పంపారు. అతడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో బతికే ఉన్నానంటూ అతడి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. అంతే వారికి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కూలిన శిథిలాల నుంచి 72 గంటల పాటు మృత్యువుతో పోరాడి క్షేమంగా బయటపడ్డ 28 ఏళ్ల ప్రకాశ్ రౌత్ కథ ఇది.
చెన్నై దుర్ఘటనలో మొత్తం 61 మంది మరణించారు. బాగా నలిగిపోయిన ఓ మృతదేహాన్ని ప్రకాశ్దిగా పొరపాటును గుర్తించారు. అతడి సొంతూరు కేంద్రపరా జిల్లా రాజ్నగర్ ప్రాంతానికి తరలించారు. తల్లిదండ్రులు కూడా శవాన్ని గుర్తించలేకపోయారు. తమ కొడుకే చనిపోయాడని భావించారు. కాగా చెన్నైలో సహాయక చర్యల చేపడుతున్న సిబ్బంది బుధవారం శిథిలాల కింద ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రకాశ్ను గుర్తించి రక్షించారు. ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత అతను ప్రాణాలతో బయటపడటం విశేషం. ప్రకాశ్ వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను బతికేఉన్నానని చెప్పాడు. చితిపై శవాన్ని ఉంచి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమైన తల్లిదండ్రులు కాసేపు కలా నిజమా తేల్చుకోలేకపోయారు. విషయం అర్థమయ్యాక సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రకాశ్ సొంతూరుకు పయనమవగా.. చితిపై ఉన్న శవం ఎవరిదో గుర్తించేందుకు చెన్నైకు వెనక్కు తీసుకుపోవాల్సివుంది.