
యువతిపై అత్యాచారం.. కాబోయే భర్తకు ఫొటోలు!
టీనగర్: యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో చెన్నైకి చెందిన క్రీడాకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ట్రిప్లికేన్‌కు చెందిన ఓ యువతి(22) కీల్పాక్కంలోని ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి హర్డిల్స్ క్రీడా కేంద్రం నిర్వహిస్తున్నారు. అక్కడ టీపీ సత్రం జ్యోతియమ్మాల్ నగర్‌కు చెందిన దీపక్ అలియాస్ డేనియల్(22) శిక్షణ పొందుతున్నాడు. తండ్రి నిర్వహిస్తున్న హర్డిల్స్ కేంద్రానికి ఆ యువతి తరచుగా వస్తుండడంతో దీపక్ ఆమెతో స్నేహంగా మెలిగాడు. అనంతరం డేనియల్, యువతి ప్రేమించుకున్నారు.
ఇటీవల కొన్ని విషయాల్లో వీరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. నెలరోజులుగా ఆ యువతి దీపక్‌తో మాట్లాడలేదు. అనేకసార్లు సెల్‌ఫోన్‌లో ప్రయత్నించినా ఆమె సమాధానం చెప్పలేదు. ఇలా ఉండగా ఆ యువతి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఆమెకు వివాహం చేసేందుకు వరుడి కోసం అన్వేషించారు. ఈ విషయం తెలియగానే దీపక్ ఆ యువతిని ప్రశ్నించాడు. అందుకామె తల్లిదండ్రులు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంది. దీంతో ఆగ్రహించిన దీపక్ ఆమెతో తాను తీసుకున్న ఫొటోను ఇంటర్నెట్‌లో విడుదల చేస్తానని బెదిరించాడు. ఆమెకు కాబోయే భర్తకు వాట్సప్ ద్వారా ఫోటో పంపాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన యువతి ఆ విషయం తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు దీపక్‌పై కీల్పాక్కం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడి వాంగ్మూలం
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తమ అభిప్రాయభేదాలకు మునుపు ఒకరోజు ఆమెను స్నేహితుల గదికి తీసుకువెళ్లి, శీతలపానీయంలో మత్తుమందు ఇచ్చి అత్యాచారం జరిపానని దీపక్ వాగ్మూలం ఇచ్చాడు. తనపై జరిగిన దారుణాన్ని ఆమె తన తల్లిదండ్రులకు బెబుతానని తనను బెదిరించిందన్నాడు. దీంతో ఆమె అసభ్య చిత్రాలను చూపగా కోపంగా వెళ్లిపోయి తల్లిదండ్రులకు చెప్పినట్టు వివరించాడు. ఈ నేపథ్యంలో దీపక్‌కు అనేకమంది యువతులతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.