ఇన్వర్టర్ల అమ్మకాలు పెంచాలనే పవర్‌ కట్‌.. | Chhattisgarh Man Comments On Power Cuts Charged With Sedition Case | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై విమర్శలు; రాజద్రోహం కేసు, అరెస్టు

Published Fri, Jun 14 2019 7:36 PM | Last Updated on Fri, Jun 14 2019 7:38 PM

Chhattisgarh Man Comments On Power Cuts Charged With Sedition Case - Sakshi

రాయ్‌పూర్‌ : కరెంటు కోతల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించిన ఓ పౌరుడిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేవిధంగా సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశాడంటూ రాజద్రోహం కేసు నమోదు చేశారు. రాజనంద్‌గాం జిల్లాకు చెందిన మంగీలాల్‌ అగర్వాల్‌ పవర్‌కట్‌ను నిరసిస్తూ ఓ వీడియో రూపొందించారు. ఇన్వర్టర్‌ కంపెనీతో.. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా కరెంటు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్వాకం వల్లే ప్రతీ రెండు గంటలకొకసారి 10 నుంచి 15 నిమిషాల పాటు కరెంటు పోతోందని పేర్కొన్నారు. ఇన్వర్టర్ల అమ్మకాలు పెంచుకునే క్రమంలో ఆయా ఉత్పత్తుల కంపెనీలు మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉందని.. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత జటిలం కానుందని వ్యాఖ్యలు చేశారు.

కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ప్రభుత్వ, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అగర్వాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. దీంతో భూపేశ్‌ బఘేల్‌ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ బీజేపీ విమర్శించింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అమాయకులను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement