
నాగ్‌పూర్: పౌరసత్వం అనేది కేవలం హక్కుల కోసం మాత్రమే నిర్దేశించినది కాదని.. సమాజం పట్ల మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సైతం వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బాబ్డే పేర్కొన్నారు. రాష్ట్రసంత్ టుకడోజీ మహరాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీలో (ఆర్‌టీఎమ్‌ఎన్‌యూ) శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశంలోని కొన్ని విద్యా సంస్థలు వ్యాపార దృక్పథంతోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. వ్యక్తిగత అనుభవంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థుల్లో మేధాశక్తిని అభివృద్ధి చేయడం, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే విద్య ప్రాథమిక లక్ష్యమని అన్నారు. క్రమశిక్షణ విద్యలో భాగమని పేర్కొన్నారు. మనకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఇతరులను కలుపుకుపోవడం, అన్యోన్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. సమాజం మన నుంచి ఏం కోరుకుంటుందో అలాంటి లక్షణాలు యువతలో పెంపొందేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందన్నారు. ఏ వ్యక్తి అయినా కృషితోనే ఓ స్థాయికి చేరుకుంటారని.. ఆ స్థితికి చేరడానికి దోహదపడిన అంశాలను ఇతరులు సృష్టించారనేది గుర్తించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment