ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్
దేశవ్యాప్తంగా 4.5 లక్షలమంది హాజరు
న్యూఢిల్లీ/సాక్షి,విజయవాడ/తిరుపతి: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. 59 నగరాల్లోని 2,137 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించగా 4.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. సివిల్స్ పరీక్షా విధానంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేయాలంటూ డిమాండ్ రాగా.. సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఎక్కడా ఎలాంటి ఆటంకాలు, నిరసనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. రెండు పేపర్ల(పేపర్-1, పేపర్-2)తో కూడిన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. మొదటి పరీక్ష ఉదయం తొమిదిన్నర గంటలకు ఆరంభమవగా.. రెండో పరీక్ష మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైంది. ఒక్కో పరీక్షకు రెండు గంటలు కేటాయించారు. కాగా పేపర్-1లోని ప్రశ్నలకు సంబంధించి హిందీ అనువాదంలో తప్పులు దొర్లినట్టు కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ప్రిలిమ్స్‌కోసం మొత్తం 9,44,926 మంది దరఖాస్తు చేయగా.. పరీక్షకు 4,51,602 మంది హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.27 లక్షల మంది అధికంగా హాజరవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతిల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విజయవాడలో 31 పరీక్ష కేంద్రాల్లో 32 శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 14,640 మందికిగాను ఉదయం జరిగిన పరీక్షకు 4,805 మంది(32.82 శాతం), మధ్యాహ్నం పరీక్షకు 4,755 మంది(32.48 శాతం) హాజరైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తిరుపతిలో నిర్వహించిన పరీక్షకు 38 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 7,796 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం జరిగిన పరీక్షకు మూడువేల మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 2,984 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో...సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు హైదరాబాద్‌లోప్రశాంతంగా కొనసాగాయి. నగరంలోని 83 కేంద్రాల్లో మొత్తం 47శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 38,798 మంది అభ్యర్థులకుగాను పేపర్-1 పరీక్షకు 18,377 మంది, పేపర్-2కు 18,161 మంది అభ్యర్థులు హాజరయ్యారు.