సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఆదివారం గ్రూప్–1 పరీక్ష నిర్వహించనుంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో ఇప్పటికే 90 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. మిగతా అభ్యర్థులు పరీక్ష ప్రారంభం నాటికి డౌన్‌లోడ్ చేసుకొనే వెసులుబాటును కమిషన్ కల్పించింది. బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో ఉదయం 8:30 గంటల నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని... ఉదయం 10:15 గంటలకుమించి ఒక్క సెకన్ ఆలస్యమైనా అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించబోమని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.
3 రోజుల్లో ప్రాథమిక కీ విడుదల...
పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ చేపడుతుండటంతో టీఎస్‌పీఎస్సీ అత్యంత పారదర్శకంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి పరీక్షా కేంద్రాన్ని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తోంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రశ్నపత్రం కోడింగ్‌లోనూ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఏ, బీ, సీ, డీ అక్షరాల్లో ప్రశ్నపత్రం కోడ్ ఉండగా ఇప్పుడు 6 అంకెల కోడ్‌ను ఉపయోగిస్తోంది.
దీంతో అభ్యర్థులు ప్రశ్నపత్రం కోడ్‌ను నిర్దేశించిన చోట జాగ్రత్తగా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కాపీయింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రిలిమినరీ ‘కీ’ని వారంలో విడుదల చేయాలని అధికారులు ముందుగా భావించినప్పటికీ ఆ తర్వాత 3 రోజుల్లోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంది. ప్రాథమిక ‘కీ’విడుదల తర్వాత వాటిపై అభ్యంతరాలను స్వీకరించి తుది ‘కీ’ని విడుదల చేయనుంది.
ప్రతి జిల్లాలో హెల్ప్‌లైన్...
గ్రూప్–1 పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లా కలెక్టరేట్ పరిధిలో హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాలు, హాల్‌టికెట్లలో తప్పొప్పులు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే సంబంధిత జిల్లా హెల్ప్‌లైన్ కేంద్రానికి ఫోన్ చేసి సంప్రదించాలని అభ్యర్థులకు సూచించింది. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని... ఎగ్జామ్ సెంటర్లలో గోడ గడియారాలు, డిజిటల్ క్లాక్‌లు కూడా ఉండవని పేర్కొంది. ప్రతి అరగంటకోసారి బెల్ మోగించి సమయాన్ని గుర్తుచేస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment