
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రాన్ని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. వర్గీకరణ చేపట్టాలంటూ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట తెలంగాణ మాదిగ జేఏసీ నేతలతో కలసి ఆయన మౌన దీక్ష చేపట్టారు.
వర్గీకరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తూ తమ సహనాన్ని పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, మంద కృష్ణల వల్ల మాదిగలు బలయ్యారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకపోతే బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.