
సాక్షి, హైదరాబాద్ : కోకాకోలా కంపెనీ తొందర్లోనే ఆల్కహాలిక్ డ్రింక్‌ను లాంచ్ చేయబోతుంది. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన తమ కంపెనీ జపాన్‌లో ఈ డ్రింక్‌ను విడుదల చేయబోతున్నట్టు కోకా కోలా జపాన్ విభాగం అధ్యక్షుడు జార్జ్ గార్డునూ తెలిపారు. ‘ఇది మద్యంతో కూడిన ఒక పానీయం. సాంప్రదాయకంగా షాచ్, మెరిసే నీరు, అదనంగా ప్రత్యేక రుచిని కలిగి ఉన్న పానీయంతో తయారు చేస్తార’ని ఆయన వెల్లడించారు.
ఇది జపాన్‌లో ప్రాచుర్యం పొందిన చు-హాయ్ పానీయాలను పోలి ఉంటుందని.. దీన్ని ద్రాక్ష, స్ట్రాబెర్రీ, తెల్ల పీచు, కివి షాచ్ వంటి పలు రుచులు వోడ్కాతో తయారుచేస్తామని కోకాకోలా ప్రకటించింది. ఇందులో 3 నుంచి 8 శాతం ఆల్కహాల్ పరిమాణం ఉంటుందని తెలిపింది. ప్రజలు మద్యపానాన్ని, కూల్ డ్రింక్‌ను కలిపి తాగుతున్నారని.. వేర్వేరు బాటిల్స్ అక్కర్లేకుండా రెండు కలిపి ఒకే సీసాలో తామే తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ డ్రింక్ జపాన్ సాంప్రదాయానికి దగ్గరగా ఉంటుందని వివరించింది.