
సమష్టిగా పనిచేయండి: మోడీ
కేబినెట్ భేటీలో సహచరులకు ఉద్బోధ
సుపరిపాలనకు కృషి చేయండి
45 మంది మంత్రులతో ప్రధాని మోడీ సుదీర్ఘ భేటీ
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి కోసం మంత్రులందరూ ఐకమత్యంగా సమష్టిగా పనిచేయాలని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన మంత్రివర్గ సహచరులకు ఉద్భోదించారు. ప్రధాని సోమవారం తన మంత్రివర్గంలోని 45 మంది మంత్రులతో అధికారిక నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పథకాల అమలులో కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులను కలుపుకుని పనిచేయాలని.. సుపరిపాలన అందించేందుకు, చేపట్టిన పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేసేందుకు.. ఆ పనుల ప్రయోజనాలు ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని వారికి సూచించారు. ప్రభుత్వ పదవుల్లో మంచి వాళ్లను నియమించాలని.. తమ తమ బంధువులను కాదని మోడీ తన మంత్రివర్గ సహచరులతో పేర్కొన్నట్లు తెలిసింది. మూడు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో ఆర్థికవ్యవస్థకు ఉత్తేజాన్నివ్వటం ఎలా? మరిన్ని ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించటం ఎలా? మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం ఎలా? అనే అంశాలపై మోడీ తన ఆలోచనలను మంత్రివర్గ సహచరులకు వివరించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
ప్రధానంగా.. మోడీ నిర్దేశించిన వంద రోజుల అజెండాపై చర్చ కేంద్రీకృతమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా పాలనకు సంబంధించిన వివిధ అంశాలపై సూచనలు అందించాలని మోడీ కోరినట్లు తెలిసింది. అలాగే.. ఇంతకుముందలి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన వివిధ ప్రాజెక్టుల ప్రగతి నివేదికలను రూపొందించాలని కూడా మంత్రులకు ప్రధాని నిర్దేశించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. మంత్రులందరినీ, ఆయా శాఖల కార్యదర్శులను తాను ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కలుస్తుంటానని మోడీ చెప్పినట్లు తెలిపాయి. ప్రధాని మంగళవారం నాడు ఆయా కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశం కానున్నారు.