ఆకలిపై పోరులో కలసి రండి
శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు
- జీవవైవిధ్య చట్టాలతో సాగుకు నష్టం లేదు
- అంతర్జాతీయ వ్యవసాయ జీవవైవిధ్య కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వ్యవసాయ జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలతో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ అభివృద్ధి దెబ్బ తినే అవకాశాలు లేవని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. వ్యవసాయంలో టెక్నాలజీ వాడకాన్ని పెంచడం ద్వారా స్థిరమైన అభివృద్ధి సాధించవచ్చన్నారు. ఆదివారం ఢిల్లీలో ప్రారంభమైన తొలి అంతర్జాతీయ వ్యవసాయ జీవ వైవిధ్య సదస్సులో మోదీ ప్రసంగించారు. ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆకలి, పోషకాహారలోపం, పేదరికంతో అలమటిస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం లభించాలంటే సైన్స్, టెక్నాలజీ కీలకం. పరిష్కారం చూపే క్రమంలో మనం స్థిరమైన అభివృద్ధిని, జీవవైవిధ్య పరిరక్షణను మరిచిపోకూడదు’ అని అన్నారు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై జాగ్రత్త వహించాలని సూచించారు.
పురుగుమందుల వినియోగం వల్ల తేనెటీగల పరపరాగ సంపర్క ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తు చేశారు. పురుగుమందుల వినియోగం వల్ల పురుగులు మాత్రమే కాక.. పర్యావరణ వ్యవస్థకు అవసరమైన కీటకాలూ అంతరించిపోతున్నాయని తెలిపారు. అందువల్ల సైన్స్ అభివృద్ధిని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. జన్యువనరులు అంతరించిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. దీనిపై జాతీయ, అంతర్జాతీయ, ప్రైవేట్ సంస్థలు కలసి పనిచేసి.. వ్యవసాయ జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ఒక పరిష్కారాన్ని సూచించాలని కోరారు.
అంతరిస్తున్న అరుదైన జాతులు..
1992 నాటి జీవ వైవిధ్య సదస్సు సిఫార్సులను అమలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం రోజుకు 50-150 జాతులు అంతరించిపోతున్నాయని, ప్రతి ఎనిమిది రకాల పక్షుల్లో ఒకటి, జంతువుల్లో నాలుగో వంతు అంతరించిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల మన ఆలోచనా విధానం మారాలని మోదీ సూచించారు. అభివృద్ధి పేరుతో చాలామంది సహజ వనరులను గుడ్డిగా దోపిడీ చేస్తున్నారన్నారు. దీనివల్లఅనేక సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ఆహార అవసరాలు, పోషకాహారం, ఆరోగ్యం, పర్యావరణ భద్రత మొదలైన వాటిని సాధించాలంటే వ్యవసాయ జీవ వైవిధ్యంపై విస్తృత చర్చలు, పరిశోధనలు జరగడం అత్యావశ్యకమని అభిప్రాయపడ్డారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ మాట్లాడుతూ.. పర్యావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌కు ఘనమైన జన్యువనరులు ఉన్నాయని చెప్పారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మాట్లాడుతూ.. భారత్‌లో ఆహార భద్రతకు వ్యవసాయ జీవవైవిధ్యం ముందడుగని చెప్పారు. వ్యవసాయ జీవవైవిధ్య సంవత్సరాన్ని నిర్వహించేలా ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదన చేయాలని మోదీని కోరారు. ఈ సదస్సుకు 60 దేశాల నుంచి 900 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
14న ఘాజీపూర్ పర్యటన
ఘాజీపూర్(యూపీ): మోదీ ఈ నెల 14న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే లైన్‌కు, గంగా నదిపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.