షెడ్యూలు ప్రకారం మే 13 వరకు జరగాల్సిన పార్లమెంటు సమావేశాలు 6నే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి.
సాక్షి, న్యూఢిల్లీ: షెడ్యూలు ప్రకారం మే 13 వరకు జరగాల్సిన పార్లమెంటు సమావేశాలు 6నే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల వల్ల డీఎంకే, ఏఐడీఎంకే, సీపీఎంలు సమావేశాలను కుదించాలని కేంద్రాన్ని కోరాయి. సమావేశాలు ముగిస్తే ఎంపీలు నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్తారు. ఏప్రిల్ 25న ప్రారంభమైన సమావేశాల్లో రాజ్యసభలో ప్రధానమైన సభావ్యవహారా లేవీ సాగలేదు.
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ ఉంది. ఒకవేళ ఈ విచారణలో ఏమీ తేలకుండా వాయిదాపడితే పార్లమెంటు సమావేశాలు ముందస్తుగా ముగిసే వీలుంది. లోక్‌సభలో ఆర్థిక బిల్లు మంగళవారం ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇది సాధ్యం కానిపక్షంలో ఐదున ఆమోదం పొందనుంది. అదే రోజు గానీ, 6న గానీ రాజ్యసభ ఆమోదం పొందొచ్చు. దీంతో సమావేశాలు 6నే ముగుస్తాయని అధికార పార్టీ భావిస్తోంది.