
కంప్యూటర్ అధిక వాడకంతో సమస్యలే..!
ఆధునిక కాలంలో కంప్యూటర్లు.. వ్యక్తి జీవితంలో ప్రధాన వస్తువులుగా మారిపోయాయి. కంప్యూటర్ లేకుండా ఏ పనీ పూర్తి కావడం లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కంప్యూటర్ ప్రధానవస్తువైపోయింది. అయితే కంప్యూటర్ అధిక వినియోగం ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలను చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్ వద్ద కూర్చొని పనిచేసేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు.
ప్రతిరోజూ కంప్యూటర్ తో పనిచేయాల్సి రావడం ఆధునిక జీవితంలో తప్పని పరిస్థితిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కంప్యూటర్ దగ్గర ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కళ్ళకు ప్రమాదమేనంటున్నారు. కళ్ళు లాగడం, నొప్పి, కంటినుంచీ నీరు కారడం, మంటలు వంటి అనేక సమస్యలతో పాటు కొందరికి దృష్టిలోపం కూడ ఏర్పడుతుందని చెప్తున్నారు. దీర్ఘకాలం కంప్యూటర్ ముందు కూర్చొనే వారిలో ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల శరీరం బరువెక్కడం, ఉబకాయం సమస్యతోపాటు సోమరులుగా కూడ మారే అవకాశం ఉందంటున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్లను వాడటంవల్ల దీర్ఘ కాల రోగాలైన ఉబ్బసం, రక్తపోటు వంటి రోగాలు సంక్రమించడంతోపాటు కొందరిలో నిరాశ చుట్టుముట్టి మానసిక వ్యాధులకు కూడ దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో ఆహారం పట్ల విముఖత ఏర్పడితే, మరి కొందరిలో అదేపనిగా తినే అలవాటుకూడ వస్తుందని, దీనివల్ల ఊబకాయ సమస్య ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం కంప్యూటర్ వద్ద కూర్చోవడం వల్ల ఒళ్ళు నొప్పులు, మెడనొప్పులు, స్పాండిలైటిస్ వంటివి కూడ ప్రధాన సమస్యలుగా మారతాయని వైద్య నిపుణుల పరిశీలనలో కనుగొన్నారు.
కంప్యూటర్లో పనిచేసే వ్యక్తులకు దీర్ఘకాలిక తలనొప్పులు సంక్రమించే అవకాశం కూడ ఉంది. అటువంటి నొప్పి ఒక్కోసారి డిప్రెషన్ కు కూడ దారితీస్తుంది. నొప్పుల వల్ల శరీరంలో శక్తి సామర్థ్యాలు తగ్గిపోవడం, అతిగా ఆలోచించడం వంటి లక్షణాలు ఏర్పడతాయని పరిశోధకులు చెప్తున్నారు. అయితే తప్పనిసరిగా కంప్యూటర్ తో పనిచేయాల్సి వచ్చిన వారు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా 45 ఏళ్ళు పైబడిన వారిలో ఈ సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నవాస్తవం బయటపడిందని పరిశోధకులు చెప్తున్నారు. తప్పనిసరిగా వ్యాయామం చేయడం, గంటకోసారైనా కాసేపు అటూఇటూ తిరగటం, వాడే సమయంలో అప్పుడప్పుడూ నీటితో ముఖం కడుక్కోవడం, ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తుండటం, స్క్రీన్ కు వీలైనంత దూరంగా కూర్చోవడం, వంటివి కంప్యూటర్ వినియోగదారులు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. అంతేకాక ముఖానికి ఎదురుగా లైట్ లేకుండా చూసుకోవడం, మానిటర్ కళ్ళకు ఎదురుగా సమానమైన ఎత్తులో ఉండేలా చూస్కోవడం, మౌస్ ప్యాడ్ వాడటం, తక్కువ రేడియేషన్ ఇచ్చే మానిటర్స్ ను వాడటం చేయాలంటున్నారు. కంటికి ఒత్తిడి తగ్గేలా యాంటీ గ్లేర్ స్క్రీన్ల వాడకం వంటి కొన్ని కనీస జాగ్రత్తలను పాటిస్తే సమస్యలకు దూరంగా ఉండొచ్చని కొంతైనా ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెప్తున్నారు.