
'కాంగ్రెస్ ఓ పాత కారు.. ఇప్పుడు నడవదు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోటును ఎదుర్కొంటుందని బీజేపీ నేత, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆ పార్టీని ఓ కాలం చెల్లిన కారుతో పోలుస్తూ నియంతృత్వ చర్యల కారణంగా ఆ పార్టీ గతంలో మనుగడ సాగించింది కానీ ఇప్పుడు అలా జరగదని అన్నారు. ప్రతి రాష్ట్రాన్ని పరిశీలించినప్పుడు ఆ పార్టీ నాయకత్వాన్ని కోల్పోతుండటం అందరికీ తెలుస్తుందని చెప్పారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా దేశ రాజకీయాలను డామినేట్ చేస్తున్న ఆ పార్టీ 50 ఏళ్లపాటు అధికారంలో ఉందని, కానీ, అనూహ్యంగా ఆ పార్టీ స్థాయి పడిపోతుందని, ఒక పెద్ద పార్టీలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదని అన్నారు.
దీనంతటికీ కారణం ప్రస్తుతం కాంగ్రెస్లో నాయకత్వ లోపం అని చెప్పారు. ఆ పార్టీలో ఒకరికొకరు అసలు పొసగదని, నిర్ణయాలు తీసుకునే సమయంలో కేంద్రానికి క్షేత్రస్థాయికి, క్షేత్రస్థాయివి కేంద్రానికి తెలియవని ఆరోపించారు. ఉత్తరాఖండ్లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్ మాటల యుద్ధం ప్రకటించినందుకు జైట్లీ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.