
సాక్షి:ఫలానా నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయి... ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు గత ఎన్నికలలో పోలయ్యాయి... ఆయా బూత్‌లలో ఏయే సామాజిక వర్గాలున్నాయి... ఆ సామాజిక వర్గాలు ఏ పార్టీవైపు మొగ్గుచూపాయి.. అందుకు కారణాలేంటి..? ఆ నియోజకవర్గం ప్రజలకు అధికార టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలు ఎలా ఉంది? అక్కడి ప్రజల తక్షణావసరాలు ఏంటి..? కాంగ్రెస్ కూటమి పక్షాన అభ్యర్థులు అక్కడి ప్రజలకు ఇవ్వాల్సిన ప్రధాన హామీలేంటి..? సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం జరగాలి? నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు ఎలా ఖర్చయ్యాయి..? ఎంత ఖర్చయ్యాయి... ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల జాతకమంతా ఒక్కచోట నుంచే కంట్రోల్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దానిపేరే వార్‌రూం.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ వార్‌రూంలను హైదరాబాద్ ప్రశాసన్‌నగర్‌లోని ఓ కేంద్రం అనుసంధానం చేస్తోంది. దీనికి ఏఐసీసీ మీడియా ఇన్‌చార్జి మెహ్రోజ్‌ఖాన్ నేతృత్వం వహిస్తుండగా, రాహుల్ కోటరీలోని ముఖ్య నాయకుడు, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు సమన్వయం చేస్తున్నారు.
ఏం చేస్తున్నారంటే..
ఈ వార్‌రూంల వేదికగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని 150 మంది సిబ్బంది అనుక్షణం ఎన్నికల పనిలో బిజీగా గడుపుతున్నారు. గత ఏడాది కాలంగా సేకరిస్తున్న సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు పార్టీ అభ్యర్థులను అప్రమత్తం చేస్తున్నారు. అధికార పార్టీ, ఇతర ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలు, వాటికి ఇవ్వాల్సిన కౌంటర్‌లను కూడా ఇక్కడి నుంచే పంపుతున్నారు. కూటమి పక్షాల మధ్య ఓట్ల బదలాయింపునకు ఉన్న అవరోధాలు, అనుకూలతల గురించి వివరిస్తూ సమన్వయం చేస్తున్నారు. రాష్ట్రంలో పోటీచేస్తున్న 99 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు ఇక్కడి నుంచి కిట్లు పంపారు. ఈ కిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ముందుకెళుతుండడం వార్‌రూం ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
కిట్‌లో ఏమున్నాయంటే...!
∙పార్టీ మేనిఫెస్టో, ∙టీఆర్‌ఎస్ వైఫల్యాలు
∙ముఖ్యమైన పనులు ∙నియోజకవర్గ మ్యాప్
∙నియోజకవర్గ స్థాయి సమావేశాల షెడ్యూల్
∙కోఆర్డినేటర్ల విధులు, వివరాలు
∙రిటర్నింగ్ అధికారుల వివరాలు
∙యువతను ఆకట్టుకునే కార్యక్రమాలు
∙గత ఎన్నికల డాటా
∙కుల సమీకరణలు
∙శక్తి యాప్ వివరాలు
∙చారమ్స్
∙ఎల్‌డీఎంఆర్‌సీ
∙సోషల్‌మీడియా
Comments
Please login to add a commentAdd a comment