‘జీఎస్టీ’పై చర్చను అడ్డుకున్న కాంగ్రెస్
రాజ్యసభలో కొనసాగిన నిరసనల పర్వం
న్యూఢిల్లీ: రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై చర్చను బుధవారం ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, జేడీయూ సభ్యులు ఐక్యంగా నిరసన గళం వినిపించి, సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. గందరగోళం మధ్య మధ్యాహ్న భోజన విరామం లోపే సభను రెండుసార్లు వాయిదా వేసిన డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, ఆ తరువాతా పరిస్థితి కుదుటపడకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. గురువారంతో వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. పార్లమెంటు కార్యక్రమాలను అడ్డుకోవద్దని, సభలో చర్చలు జరిగి, చట్టాలు రూపొందించాలని ఎంపీలకు విజ్ఞప్తి చేస్తూ పలువురు పారిశ్రామికవేత్తలు సహా దాదాపు 18వేల మంది ఆన్‌లైన్ సంతకాల సేకరణను చేపట్టడంపై విపక్షాలు మండిపడ్డాయి.
ఈ ప్రభుత్వం క్యాపిటలిస్టుల ప్రభుత్వమనడానికి ఇదే రుజువని, రోపించాయి. దీనిపై ‘సామాన్యులు సభ జరగాలని కోరుకోవడం లేదంటారా?’ అంటూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించడంతో విపక్ష సభ్యులు ఆగ్రహంగా పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేయటంతో మధ్యాహ్నం 12గంటల వరకు సభను వాయిదా వేశారు. పారిశ్రామికవేత్తల ఆన్‌లైన్ ఉద్యమంపై స్పందిస్తూ.. ‘ఇది పార్లమెంటు ప్రతిష్టకు సంబంధించిన విషయం. సభను ఎలా నడపాలో కొందరు పారిశ్రామికవేత్తలు మనకు నేర్పించాలనుకుంటున్నారు.
కాంగ్రెస్‌పై దాడికి ఈ ప్రభుత్వం మీడియాను, వ్యాపారవేత్తలను ఉపయోగించుకుంటోంది, తమకు అనుకూలంగా లేని వార్తాచానెళ్లను భయపెట్టినట్లుగా ఈ ప్రభుత్వం ఎంపీలను భయపెట్టలేదు’ అని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. ఎంపీల విధుల్లో ఇండస్ట్రియలిస్టులు జోక్యం చేసుకోవడం తగదని సీపీఎం నేత సీతారాం యేచూరి వ్యాఖ్యానించారు. లోక్‌సభలో జరిగినట్లే రాజ్యసభలోనూ లలిత్‌మోదీ వ్యవహారంపై ఓటింగ్‌కు వీలైన నిబంధన కింద చర్చ జరగాలన్నారు. మధ్యాహ్నం సభ మరోసారి ప్రారంభమైన తరువాత విపక్ష సభ్యులు వెల్ వద్ద తమ నిరసనను కొనసాగించారు.
నినాదాలతో హోరెత్తించారు. మళ్లీ సమావేశమయ్యా క .. జీఎస్టీ బిల్లుపై చర్చను ప్రారంభించాలని అరుణ్ జైట్లీని డిప్యూటీ చైర్మన్ కోరారు. జైట్లీ మాట్లాడబోతుండగా.. వెల్ వద్దకు మరోసారి దూసుకువచ్చిన కాంగ్రెస్‌సభ్యులు ‘నో’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాంతో కాంగ్రెస్ సభ్యులను సముదాయించేందుకు పీజే కురియన్ ప్రయత్నించారు. ‘ఇది (జీఎస్టీ) మీ బిల్లు. ఇది కాంగ్రెస్ పార్టీ బిడ్డ. గతంలో ఒకసారి మీ(యూపీఏ) హయాంలోనే దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయండి. మిమ్మల్నెవరూ ఆపబోరు’ అన్నారు. విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించటంతో సభను గురువారానికి వాయిదా వేశారు.
5రాజ్యసభలో నేడు జీఎస్టీ గట్టెక్కకపోతే...
ఉభయసభల సంయుక్త సమావేశం!
న్యూఢిల్లీ: వస్తు సేవల బిల్లు (జీఎస్టీ)ను ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాలసమావేశాల ఆఖరి రోజైన గురువారం జీఎస్టీ బిల్లు రాజ్యసభలో గట్టెక్కకపోతే... ఉభయసభల సంయుక్త సమావేశమే మార్గమని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌కమిటీ సమావేశం జరుగనుంది.
సంయుక్త సమావేశానికి సంబంధించి దీంట్లో ఒక నిర్ణయానికి రావొచ్చని భావిస్తున్నారు. సమావేశాలు ముగిశాక సభలను నిరవధికంగా వాయిదావేస్తే... సంయుక్త సమావేశాన్ని పిలవడం సులభం. కానీ వచ్చిన చిక్కేమిటంటే భూసేకరణ బిల్లుపై జారీచేసిన ఆర్డినెన్స్ గడువు ఈనెల 31తో ముగియనుంది. కాబట్టి ఆర్డినెన్స్‌ను మళ్లీ (ఇది నాలుగోసారి అవుతుంది) జారీ చేయాల్సిందే.
ఎందుకంటే భూసేకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జేపీసీ కి నివేదిక ఇచ్చేందుకు గడువును శీతాకాల సమావేశాల దాకా పొడిగించారు.ఉభయసభల్లో ఏదో ఒకదానిని ప్రొరోగ్ చేస్తే తప్ప ఆర్డినెన్స్ జారీచేయడానికి వీల్లేదు. జీఎస్టీ బిల్లుకు తాజాగా తృణమూల్ బాహాటంగా మద్దతు ప్రకటించింది. అలాగే ఎన్సీపీ తదితర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోగలిగితే... గురువారం జీఎస్టీ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. లేకుంటే సంయుక్త సమావేశం మార్గాన్ని ఎంచుకోక తప్పదు.