
పెట్రో ధరల తగ్గింపు ప్రచార ఎత్తుగడే..
సాక్షి, న్యూఢిల్లీ : కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఇంధన ధరలను ఇటీవల కేంద్రం స్వల్పంగా తగ్గించిందని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఎన్నికల తాయిలాలను ప్రకటించకుండా పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇంధన ధరలపై కేంద్రం ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయని ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఆందోళన వ్యక్తం చేశారు.
కర్నాటక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్రో ధరలను పెంచని కేంద్ర ప్రభుత్వం అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏం చేయనుందని ప్రశ్నించారు. పెట్రో దరలను ఎన్నికలతో ముడిపెట్టి తాయిలాలు ప్రకటించే కన్నా వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఘర్-ఘర్ మోదీ సమయం నుంచి బైబై మోదీ సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.
పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ప్రజల ముఖాల్లో నవ్వులు తీసుకురావచ్చని హితవు పలికారు. ఇంధన విక్రయాల ద్వారా ప్రభుత్వానికి సమకూరే రూ 13 లక్షల కోట్లను కేంద్రం ప్రచారాలకు, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కు వెచ్చిస్తోందని ఆరోపించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫుల్‌టైమ్ బ్లాగర్‌లా, పార్ట్‌టైమ్ మంత్రిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.