మణిశంకర్‌ అయ్యర్‌ సస్పెన్షన్‌ | Congress suspends Mani Shankar Aiyar over 'Neech aadmi ' jibe against PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మణిశంకర్‌ అయ్యర్‌ సస్పెన్షన్‌

Published Fri, Dec 8 2017 2:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress suspends Mani Shankar Aiyar over 'Neech aadmi ' jibe against PM Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ‘నీచ జాతికి చెందిన వ్యక్తి’ అంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ను కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. మోదీపై చేసిన ఈ పరుష వ్యాఖ్యలు గుజరాత్‌ ఎన్నికల్లో పెను ప్రభావం చూపనున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగానే క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. రాజకీయ దుమారం రేగటంతో అయ్యర్‌ క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసింది. షోకాజ్‌ నోటీసులూ జారీచేసింది. 

అయ్యర్‌ వ్యాఖ్యలను సమర్థించబోమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులెవరూ ఇలాంటి పరుష పదాలను వినియోగించకూడదని ఆయన కోరారు. అంతకుముందు, ఢిల్లీలో అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ.. రాజ్యాంగ నిర్మాత దేశానికి చేసిన సేవలను చెరిపేసేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని వ్యాఖ్యానించారు.

దీనిపై మణిశంకర్‌ అయ్యర్‌ స్పందిస్తూ.. ‘మోదీ నీచమైన జాతికి చెందిన వ్యక్తి, ఆయనకు సభ్యత లేదు’ అని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు గుజరాత్‌ ఎన్నికల సమయంలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ప్రధాని అదే స్థాయిలో స్పందించారు. ఈ వ్యాఖ్యలు గుజరాతీలకు జరిగిన అవమానమని, కాంగ్రెస్‌ నేతల మొఘల్‌ ఆలోచనకు ఇది ప్రతిరూపమని సూరత్‌ అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటేయటం ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

అసలేం జరిగింది?
గురువారం ఢిల్లీలో అంబేడ్కర్‌ అంతర్జాతీయ కేంద్రాన్ని  మోదీ ప్రారంభించారు. అంబేడ్కర్‌ పేరుతో ఓట్లు అడుగుతున్న కొన్ని పార్టీలు అంబేడ్కర్‌∙సేవలను చెరిపివేసేందుకు ప్రయత్నించాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ‘అంబేడ్కర్‌ సిద్ధాంతాలను కొందరు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. జాతి నిర్మాణానికి ఆయన చేసిన సేవలను చెరిపివేయాలని చూశారు. కానీ ప్రజల మనసుల్లో అంబేడ్కర్‌ ఆదర్శాలు అలాగే నిలిచి ఉన్నాయి’ అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015లో ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారని.. 23 ఏళ్లుగా గత ప్రభుత్వాలు ఈ అంశంపై ఆలోచిస్తూనే ఉన్నాయని విమర్శించారు. మోదీ వ్యాఖ్యలపై అయ్యర్‌ తీవ్రంగా స్పందించారు. ‘ఆ వేదిక ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ప్రధానికేముంది?. ఆయన చాలా నీచమైన వాడు (బహుత్‌ నీచే కిస్మ్‌కీ ఆద్మీ హై) నీచమైన మనిషి. కొంచమైనా సభ్యత లేదు’ అని తీవ్రంగా మండిపడ్డారు.

విభేదించిన కాంగ్రెస్‌
అయ్యర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానికి అయ్యర్‌ క్షమాపణ చెప్పాలని పార్టీ పరంగా, తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు రాహుల్‌గాంధీ  చెప్పారు. ‘బీజేపీ, ప్రధాని తరచుగా కాంగ్రెస్‌ పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి భాషను వాడటం కాంగ్రెస్‌ సంస్కృతి కాదు. అయినా, మణిశంకర్‌ అయ్యర్‌ ఉపయోగించిన భాష, పదాల తీవ్రతను నేను సమర్థించను. తన వ్యాఖ్యలపై అయ్యర్‌ క్షమాపణలు చెప్పాలని భావిస్తున్నా’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

అయ్యర్‌ క్షమాపణ..
మోదీపై తను చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపటంతో అయ్యర్‌ స్పందించారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. మోదీ కులం నీచమైనదని చెప్పాలన్నది తన ఉద్దేశం కాదని.. తనకు హిందీ సరిగా రాని కారణంగా ఆ పదాన్ని వాడాల్సి వచ్చిందన్నారు. ‘నీచ్‌కు హిందీలో చాలా అర్థాలున్నాయని చెప్పారు. ఒకవేళ మోదీ నా వ్యాఖ్యలను నీచజాతిగా భావించి ఉన్నట్లయితే క్షమాపణలు చెబుతున్నా.

ఇలా జాతి గురించి తప్పుగా మాట్లాడటం నా సంస్కృతి కాదు. నా వ్యాఖ్యలు గుజరాత్‌లో పార్టీకి నష్టం చేస్తాయని భావిస్తున్నందునే క్షమాపణలు కోరుతున్నా’ అని అయ్యర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై, అంబేడ్కర్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకే తను మోదీపై చేసిన వ్యాఖ్యల్లో ‘నీచ’ పదాన్ని వాడానన్నారు. అయితే, రెండ్రోజుల్లో గుజరాత్‌ తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అయ్యర్‌ను కాంగ్రెస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. షోకాజ్‌ నోటీసులు జారీచేసింది.

ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన అయ్యర్‌పై వేటు వేయటం ద్వారా గుజరాత్‌లో కొంతకాలంగా చేస్తూవస్తున్న సోషల్‌ ఇంజనీరింగ్‌ నీటిపాలు కాకుండా చూసుకుంటోంది. ‘మాజీ ప్రధానులైన నెహ్రూ, ఇందిరలను మోదీ అవమానిస్తున్నారు. అయినా.. దీనిపై అదే భాషలో ప్రతిస్పందించటం మా పార్టీ సంస్కృతి కాదు’ అని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా తెలిపారు.

గుజరాతీలకే అవమానం: మోదీ
అయ్యర్‌ వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. సూరత్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘మణిశంకర్‌ అయ్యర్‌ నన్ను నీచజాతికి చెందినవాడినన్నారు. నన్ను నీచుడినన్నారు. ఇది గుజరాత్‌కే అవమానం. ఆ మాటకొస్తే యావద్భారతానికే అవమానం. మంచి దుస్తులు ధరించే వారిని చూసి ఓర్వలేదు. ఇది మొఘల్‌ల ఆలోచనాధోరణికి ప్రతీక. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటువేసి కాంగ్రెస్‌కు సరైన సమాధానం ఇవ్వండి’ అని అన్నారు. తనను మృత్యు బెహారీ అని జైలుకు పంపిస్తామని విమర్శలు చేశారని గతంలో కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

‘అతను (అయ్యర్‌) సంపన్న కుటుంబం నుంచి వచ్చి ఉండొచ్చు. వర్సిటీల్లో చాలా డిగ్రీలు పొంది ఉండొచ్చు. దౌత్యవేత్తగా, కేంద్ర మంత్రిగా పనిచేసుండొచ్చు. కానీ ఇంతలా ఓ వ్యక్తిని అవమానించాలా? కులం పేరుతో మాపై వివక్ష చూపుతారు. ‘మురికినీళ్లలో పురుగు’ (గందీ నాలీకా కీడా), గాడిద, నీచుడంటూ చులకన చేస్తారు’ అని మోదీ పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు అయ్యర్‌ వ్యాఖ్యలపై స్పందించకూడదని మోదీ పేర్కొన్నారు.

ఈ మధ్య కాంగ్రెస్‌ పార్టీ బాబా సాహెబ్‌ (అంబేడ్కర్‌) కన్నా భోలే బాబాపైనే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తోందని పరోక్షంగా రాహుల్‌పై విమర్శలు చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కూడా అయ్యర్‌ వ్యాఖ్యలను ఖండించారు. ‘యమరాజు, మృత్యుబెహారీ, రావణుడు, మురికి నీళ్లలో పురుగు, కోతి, రెబీస్‌ బాధితుడు, వైరస్, భస్మాసురుడు, గూండా.. వంటి పదాలను ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేతలు తరచూ వాడుతున్నారు. అయినా వారంతా బాగుండాలని మేం కోరుకుంటాం’ అని షా పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement