న్యూఢిల్లీ: ఇక తెలుగుదేశం పార్టీ పక్ష నేత తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన సవరణ బిల్లును తాను సమర్ధిస్తున్నానని అన్నారు.
న్యూఢిల్లీ: ఏపీకి ఎమ్మెల్సీ స్థానాలు పెంచేందుకు అనువుగా తీసుకొచ్చిన ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై మంగళవారం లోక్ సభలో తెలుగుదేశం పార్టీ పక్ష నేత తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన సవరణ బిల్లును తాను సమర్ధిస్తున్నానని అన్నారు. దీనివల్ల ఏపీ ఎమ్మెల్సీల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా విభజన చేశారని చెప్పారు. కాంగ్రెస్ నిర్వాకంతోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇబ్బుందుల పడుతున్నారని చెప్పారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్పై కాంగ్రెస్ పెద్దలు కపటప్రేమను ప్రదర్శించారు.. ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తున్నారని విమర్షించారు. ఆంధ్రప్రదేశ్ పై ప్రేమ ఉన్నట్లు సోనియాగాంధీ మాట్లాడటం అభినందనీయమన్నారు. విభజనకు ముందు ఒక్క నిమిషం ఏపీ గురించి మాట్లాడినా అంతా మంచి జరిగి ఉండేదని చెప్పారు.
అశాస్త్రీయంగా విభజించడంవల్లే నేడు రాష్ట్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని చెప్పారు. మరోపక్క, ఎంపీ సౌగత్ రాయ్ మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రమే నిధులు నివ్వాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్నేహభావంతో మెలగాలని ఆయన కోరారు. అలాగే, ఒడిశా ప్రాంత ఎంపీ ఆర్కే జానా మాట్లాడుతూ పోలవరాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని, ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కూడా తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. పోలవరంతో తమ ప్రాంతాలు చాలా వరకు ముంపు బారిన పడతాయని చెప్పారు.