
సేవా రుసుం తప్పనిసరి కాదు
► కస్టమర్లు స్వచ్ఛందంగా ఇస్తేనే హోటళ్లు తీసుకోవాలి
► రుసుం తప్పనిసరంటే కేసు వేయొచ్చు: కేంద్రం
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో సేవా రుసుం (సర్వీస్ చార్జీ) తప్పనిసరి కాదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పాశ్వాన్ చెప్పారు. ఆ చార్జీ కస్టమర్లు స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోవాలన్నారు. ఈ మేరకు సేవా రుసుంపై నూతన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. కస్టమర్లకు సేవ చేసినందుకు ఎంత వసూలు చేయాలన్నది హోటళ్లు, రెస్టారెంట్లు నిర్ణయించడం సరికాదని, అది వినియోగదారుడి విచక్షణకే వదిలేయాలని ఆయన సూచించారు.
కొత్త మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపించినట్లు చెప్పారు. ‘సేవా రుసుం అనేదేమీ లేదు. దీన్ని తప్పుగా వేస్తున్నారు. ఈ అంశంపై మేం ఓ సలహాపూర్వక నివేదిక సిద్ధం చేశాం. దాన్ని ప్రధాని కార్యాలయ ఆమోదానికి పంపించనున్నాం’ అని చెప్పారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం బిల్లులో సేవా రుసుం కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలి. వినియోగదారుడు ఇష్టపడితే ఆ ఖాళీని పూరించి బిల్లు చెల్లించవచ్చు.
ఎవరైనా సేవా రుసుం తప్పనిసరి అన్నట్లయితే దానిపై వినియోగదారుల కోర్టులో కేసు వేయొచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమ భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం (హెచ్‌ఆర్‌డబ్ల్యూఐ) అధ్యక్షుడు దిలీప్ దత్వానీ స్పందిస్తూ.. ఇది హేతుబద్ధమైన ట్యాక్స్ అన్నారు. ఇవేం రహస్యమైన చార్జీలుకావని మెనూలో పేర్కొంటామని చెప్పారు.