
‘దాదా’ కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ
కోల్‌కతా: మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీని తమ పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ‘మా పార్టీలో చేరండి. లోక్‌సభ టికెట్‌తో పాటు క్రీడామంత్రి పదవి ఇస్తామ’ంటూ బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిన మర్నాడే కాంగ్రెస్ రంగంలోకి దిగింది. పార్టీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్‌ను ఆదివారం గంగూలీ ఇంటికి పంపించింది. అయితే, అది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, రాజకీయాలు చర్చకు రాలేదని ప్రదీప్ చెప్పినప్పటికీ గంగూలీని పార్టీలో చేర్చుకునే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లారని సమాచారం. మరోవైపు, గంగూలీ ఎప్పటి నుంచో తమవాడని, ఇకపైనా తమతోనే ఉంటాడని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. కాగా, బీజేపీలో చేరాలన్న ఆ పార్టీ విజ్ఞప్తిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గంగూలీ చెప్పారు.