
కొనసాగనున్న ‘ఆధార్’!
న్యూఢిల్లీ: ‘ఆధార్’ ప్రాజెక్టును కొనసాగించే అవకాశమున్నట్లు కొత్త ప్రభుత్వం బడ్జెట్‌లో సంకేతమిచ్చింది. ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండే ఆధార్ కార్డులను జారీ చేస్తున్న ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్)కు 2014-15 గాను రూ. 2,039 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం గత ఏడాది కేటాయింపులకంటే రూ. 1,550 కోట్లు ఎక్కువ. ఉడాయ్ మరో 10 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి.
ప్రధాని మోడీ ఆధార్ ప్రాజెక్టుకు మద్దతిస్తున్నారని, ప్రభుత్వ సబ్సిడీలను నేరుగా అందించే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నారని సమాచారం. 70 కోట్ల మంది వివరాలు నమోదు చేసిన ఉడాయ్ 65 కోట్ల మందికి ఆధార్ కార్డులు మంజూరు చేయడం తెలిసిందే. జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్‌పీఆర్) కింద దేశ ప్రజలందరికీ బహుళార్థక జాతీయ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉడాయ్ వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించాలని గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు.