లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో తొలిసారి ప్లాస్మా చికిత్స తీసుకున్న వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన 53 ఏళ్ల ప్రభుత్వ వైద్యుడు, అతని భార్య కరోనా బారిన పడ్డారు. దీంతో వారిద్దరినీ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో చికిత్స అందించారు. అయితే గత కొంతకాలంగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న వైద్యుడు ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి రక్తాన్ని ఎక్కించుకుని ప్లాస్మా చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. ఇంతలోనే కిడ్నీ ఇన్‌ఫెక్షన్ సోకడంతో శనివారం రాత్రి ప్రాణాలు విడిచాడు. అయితే అతను మరణించడానికి ముందు చేసిన పరీక్షల్లో నెగెటివ్ అని రావడం గమనార్హం. (‘ప్లాస్మా’పై 21 సంస్థలకు అనుమతి)
ఈ ఘటన గురించి కేజీఎంయూ అంటు వ్యాధి విభాగం ఇన్‌చార్జ్ డా. డి.హిమాన్షు మాట్లాడుతూ.. "అతడు అప్పటికే మధుమేహం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో అతనికి మేము ప్లాస్మా థెరపీ ప్రయోగించాం. ఆ తర్వాత అతని ఊపిరితిత్తుల పరిస్థితితోపాటు, గుండె పనితీరు కూడా మెరుగుపడింది. ఆ తర్వాత అకస్మాత్తుగా అతనికి మూత్రాశయ ఇన్ఫెక్షన్ సోకి అది మరణానికి దారి తీసింది" అని తెలిపారు. కాగా మహారాష్ట్రలోనూ తొలిసారిగా ప్లాస్మా చికిత్స ప్రయోగించిన వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా ఢిల్లీ తర్వాత ప్లాస్మా చికిత్స ప్రయోగించిన రెండవ రాష్ట్రంగా యూపీ నిలిచింది. (మహారాష్ట్రలో ప్లాస్మా చికిత్స ఫెయిల్)
Comments
Please login to add a commentAdd a comment