
తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్‌లో ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కార్మికులకు ఎదురవుతున్న పలు సమస్యల పరిష్కారానికి గాను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చీఫ్ లేబర్ కమిషనర్(సీఎల్‌సీ) (సీ) నేతృత్వంలో దేశవ్యాప్తంగా 20 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. కేంద్ర పరిధిలో పనిచేసే కార్మికుల వేతన సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడం, దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వలస కార్మికుల సమస్యలను తగ్గించడం వంటి లక్ష్యాలతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌లను లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు, ప్రాంతీయ కార్మిక కమిషనర్లు, ఆయా ప్రాంతాల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ కాల్ సెంటర్లను కార్మికులు వివిధ సమస్యల నిమిత్తం ఫోన్ చేయడం లేదా వాట్సాప్, ఈ–మెయిల్స్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఈ మొత్తం 20 కాల్ సెంటర్ల పనితీరును ప్రతిరోజూ కేంద్ర కార్యాలయం నుంచి చీఫ్ లేబర్ కమిషనర్ (సీ) పర్యవేక్షిస్తున్నారు.
కాల్ సెంటర్లు ఇవే..
హైదరాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, చండీగఢ్, అసన్‌సోల్, భువనేశ్వర్, కొచ్చి, చెన్నై, డెహ్రాడూన్, ధన్‌బాద్, గువాహటి, జబల్‌పూర్, కాన్పూర్, ముంబై, నాగ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్‌లో ఈ కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉన్న కార్మికులు లాక్‌డౌన్ సమయంలో ఎదురవుతున్న సమస్యలను గురించి అధికారులు వీటీ థామస్ (ఫోన్ నం: 94962 04401), పి.లక్ష్మణ్ (ఫోన్ నం: 83285 04888), ఎ.చతుర్వేది (ఫోన్ నం: 85520 08109)లకు తెలియజేస్తే అధికారులు తగిన పరిష్కారం చూపుతారని కార్మిక శాఖ తెలిపింది.