
బస్టాండ్‌లో కరోనా రోగి మృతదేహం
అహ్మదాబాద్ : కరోనా వైరస్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఛగన్ మక్వానా (67) అనూహ్యంగా బస్టాండ్‌లో విగతజీవిగా పడిఉన్న ఘటన కలకలం రేపింది. మే 10 నుంచి కరోనా వ్యాధితో బాధపడుతూ అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మక్వానా మృతదేహం నగరంలోని బీఆర్‌టీఎస్ బస్టాండ్ వద్ద పోలీసులు కనుగొన్నారు. మృతుడి జేబులో లభించిన లేఖ, మొబైల్ పోన్ ద్వారా ఆయనను ఛగన్ మక్వానాగా గుర్తించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆయన శాంపిల్స్‌ను పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
దీంతో మక్వానాను సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంతలోనే మక్వానా మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోగానే సమాచారం అందిస్తామని ఆస్పత్రి వైద్యులు తమకు తెలిపారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. రెండు వారాలుగా తాము హోం క్వారంటైన్‌లో ఉన్నామని వారు చెప్పుకొచ్చారు. కరోనా పాజిటివ్‌గా తేలినప్పటికీ అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి నుంచి మక్వానాను బయటకు ఎందుకు పంపారో తెలపాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ విచారణకు ఆదేశించారు.