తిరువంతనంతపురం: ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా కరోనా కలవరింతే. ఆ మహమ్మారి దెబ్బకు జనాలు గుమ్మం దాటాలంటే జంకుతున్నారు. కొన్ని అత్యవసర పనులు తప్పితే బయట అడుగు పెట్టేదే లేదంటున్నారు. మరి పైన ఫొటోలో కనిపించే మగమహారాజులు ఎక్కడికి వెళుతున్నారనుకుంటున్నారా? ఏదో పరీక్షలు రాసేందుకు కాదు, అలా అని వారు నిలబడింది ఏ రేషన్ షాపు దుకాణం ఎదుటో కూడా కాదు... మద్యం షాపు ముందు. అవును, కేరళలో మందుబాబులు సామాజిక ఎడం పాటిస్తూ క్యూ లైన్ కట్టిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (‘రాత్రయితే తాగుడే.. లేదంటే కుదరదే..!’)
అసలే కరోనా కాలం.. ఇప్పటికే దాన్నుంచి తప్పించుకోవాలంటే సామాజిక ఎడం పాటించమని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఎందుకైనా మంచిదని మందుబాబులు ఒకరికి మరొకరికి మధ్య ఒక మీటర్ ఎడం పాటిస్తూ నిలబడ్డారు. అందుకనువుగా మద్యం దుకాణం ఎదుట క్యూలైన్‌లో ముగ్గుతో గీతలను కూడా గీసి ఉంచడం విశేషం. ఈ క్యూలైన్‌లో ముఖాలకు చేతులు అడ్డుపెట్టుకుని కొందరు, కర్చీఫ్ కట్టుకుని మరికొందరు కనిపిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం అవన్నీ దండగ అనుకున్నాడో ఏమో కానీ, నా రూటే సెపరేటు అంటూ ఏకంగా హెల్మెట్ ధరించి వరుసలో నిలబడ్డాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘వహ్వా.. మందుబాబుల ముందుజాగ్రత్త అదిరిపోయింది’ అని పొగడకుండా ఉండలేకపోతున్నారు. (‘ఈ సంక్షోభం చాలా పెద్దది’)
Comments
Please login to add a commentAdd a comment