
కన్హయ్య భద్రతపై సీపీఐ ఆందోళన
పట్నా/ముంబై/న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యను చంపితే, నాలుకను కొస్తే బహుమతులు ఇస్తామన్న వార్తల నేపథ్యంలో అతని భద్రతపై సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. జేఎన్‌యూలో కన్హయ్య భద్రంగా ఉన్నా, బయటకొస్తే ప్రాణభయం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ పట్నాలో విలేకరులతో చెప్పారు. కేంద్రంలో బీజేపీ పాలన హిట్లర్ నియంతృత్వాన్ని గుర్తుకుతెచ్చేలా ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు హిందూత్వ అజెండాను అమలు చేసేందుకే జాతీయవాదంపై చర్చ లేవనెత్తుతున్నాయని విమర్శించారు.
ఇదిలావుంటే.. కన్హయ్యపై రాజద్రోహ నేరాన్ని తప్పుపడుతూ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షులు ముందుకొచ్చారు. వర్సిటీని దేశ వ్యతిరేక నిలయంగా చిత్రీకరించే ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తామని మాజీ అధ్యక్షులైన సుచేత డే, రోహిత్ , అశుతోష్ కుమార్ తదితరులు అన్నారు. కాగా.. వర్సిటీలో ఫిబ్రవరి 9 నాటి సమావేశానికి అనుమతి రద్దుపై కన్హయ్య అభ్యంతరం తెలిపాడని ఉన్నత స్థాయి కమిటీకి రిజిస్ట్రార్ భూపిందర్ జుట్షీ తెలిపారు.
ఏబీవీపీ ప్రోద్బలంతో వేధిస్తున్నారు
అలహాబాద్: ఏబీవీపీ ప్రోద్బలంతో అలహాబాద్ యూనివర్సిటీ అధికారులు తనను వేధిస్తున్నారని వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు రిచాసింగ్ ఆరోపించటంతో మరో వివాదం రాజుకుంది.