బారాముల్లాలో ఎదురుకాల్పులు
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా టాంగ్‌మార్గ్ ప్రాంతంలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు. ఇక్కడి కుంజెర్ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఆ సందర్భంగా ఎదురుకాల్పులు జరిగాయని ఆయన చెప్పారు. అక్కడ ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకుపోయారని తెలిపారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు, ఆర్మీ జవాను మృతి చెందారని, మరో ఇద్దరు జవాన్లు, ఒక గ్రామస్తుడు గాయపడ్డాడని వెల్లడించారు. ఆ ఉగ్రవాదుల జాడ కనిపెట్టడానికి భారీ ఎత్తున శోధిస్తున్నామని ఆ పోలీసు అధికారి పేర్కొన్నారు.