న్యూఢిల్లీ: పెద్ద నోట్లను నిషేధించిన నేపథ్యంలో బ్యాంకుల్లో నోట్లు మార్చుకునే వ్యక్తులు ఒక్కసారి కాకుండా పదే పదే పలు బ్యాంకులు తిరుగుతూ పలుసార్లు నోట్లు మార్చుకుంటున్నారని తెలిసి కేంద్ర ఆర్థిక శాఖ ఎన్నికల్లో ఉపయోగించే ‘చెరగని సిరా’ మరకల విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెల్సిందే. బుధవారం కొన్ని బ్యాంకుల్లో ప్రారంభించిన ఈ విధానం గురువారం నాటికి దేశంలోని అన్ని బ్యాంకులకు విస్తరించింది.
ఆ సిరాను ఎలా చెరపేసుకోవచ్చో అనుభవజ్ఞులే కాకుండా సామాన్యులకు కూడా బాగానే తెలుసనే విషయం మనకు తెల్సిందే. చేతి వేలుమీద సిరా మరక ఆరిపోయిన కొద్దిపేపటికి అగ్గిపుల్ల గంధకంతో గీకేసి సబ్బుతో చేతి వేలును శుభ్రం చేసుకోవడం చాలా పాపులర్ విధానం. కొంత మంది పలు టూత్ పేస్ట్లు, స్పిరిట్లు ఉపయోగించి కూడా ఈ మరకలను ఆనవాళ్లు లేకుండా పూర్తిగా కడిగేస్తారు.
ఎన్నికల సిరా గుర్తును చెరిపేసుకొని ఒక్కొక్కరు రెండుసార్లు పార్టీకి ఓటు వేయమంటూ ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ఒకప్పుడు పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సిరాను ఎలా చెరపేసుకోవచ్చో చూపించే పలు వీడియోలో యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి.