సాక్షి, న్యూఢిల్లీ : అరుణాచల్, అస్సాం రాష్ట్రాల గుండా పారుతున్న బ్రహ్మపుత్ర నదిలోని స్వచ్ఛమైన నీరు నెలరోజుల క్రితం హఠాత్తుగా నల్లగా మారిపోవడం, ఆ నీటిలో లక్షలాది చనిపోయిన చేపలు కొట్టుకురావడం పట్ల ఇరు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతికి గురైన విషయం తెల్సిందే. మార్గమధ్యంలో చైనా అక్రమంగా డ్యామ్‌లు నిర్మించేందుకు ప్రయత్నించడం లేదా అందుకోసం నదిని మళ్లించడం తదితర చర్యల వల్ల ఇలా నీళ్ల రంగు మారిపోయి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అభిప్రాయపడ్డాయి. చైనా ఆగడాలను అరికట్టాలంటూ గగ్గోలు పెట్టాయి. శాస్త్రవేత్తలు శాటిలైట్ చిత్రాలను క్షుణ్నంగా పరిశీలించడం ద్వారా వాస్తవాలను ఇప్పుడు నిగ్గుతేల్చారు.
బ్రహ్మపుత్ర నదిలో సాధారణంగా డిసెంబర్ నెలలో బంక మట్టి, మడ్డి కలిసిన బురద శాతం 12–15 (ఎన్‌ఎఫ్‌యూ) యూనిట్లు ఉంటుంది. నెల రోజుల క్రితం ఈ నదిలో ఈ బురద 425 యూనిట్లకు చేరుకోవడంతో నీటిరంగు పూర్తిగా మారిపోయింది. ఆక్సిజన్ శాతం అడుగంటి పోవడం వల్ల లక్షలాది చేపలు చనిపోయాయి. నీరు ఇలా మారిపోవడానికి, ఆ స్థాయిలో బురద వచ్చి చేరడానికి కారణం ఏమిటీ? మన దేశంలో బ్రహ్మపుత్రగా పిలిచే నదిని చైనాలో ‘సియాంగ్’ అని టిబెట్‌లో ‘యార్లుంగ్–త్సాంగ్‌పో’ అని పిలుస్తారు. టిబెట్‌లో ఆవిర్భవించిన ఈ నది చైనా భూభాగంలో రెండువేల కిలోమీటర్లు ప్రవహించి అరుణాచలం గుండా, అస్సాంలోకి ప్రవేశించి ఆ రాష్ట్రంలో దిబాంగ్, లోహిత్ నదులలో కలసిపోతోంది. అందుకని ఈ నదికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా ముందుగా చైనానే అనుమానిస్తాం.
చైనాకు సరిహద్దులోని టిబెట్ భూభాగంలోని గ్యాలాపెరి పర్వతం, నాంచాబార్వా పర్వతాల మధ్యనున్న ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లోయగుండా బ్రహ్మపుత్ర నది పారుతూ వస్తోంది. ఈ రెండు పర్వతాల మధ్య నది 180 డిగ్రీల కోణంలో తిరుగుతోంది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 17వ తేదీ, ఉదయం నాలుగు గంటలకు గ్యాలాపెరి పర్వతంపై 6.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పటినుంచి 32 గంటల్లో ఐదుసార్లు భూప్రకంపనలు వచ్చాయి. అన్ని ప్రకంపనలు నాలుగు పాయింట్లకన్నా ఎక్కువ తీవ్రతతోనే వచ్చాయి. నవంబరం 23న 4.7 తీవ్రతతో మరో భూప్రకంపం వచ్చింది. ఈ ప్రకంపనల కారణంగా వంద చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొండ చరియలు, మట్టి పెళ్లలు విరిగి పడ్డాయి. కొండ చెరియలు విరిగిపడడం 20 రోజులపాటు నిరంతరంగా కొనసాగింది. ఇదంతా శాటిలైట్ తీసిన కెమేరాల్లో రికార్డయింది. చైనాలోని తూర్పు సియాంగ్ జిల్లా నుంచి చైనా సరిహద్దులోని గెలింగ్ నగరానికి మధ్య దాదాపు 30 కిలోమీటర్ల పొడవున నదిలో కొండ చెరియలు, మట్టి పెళ్లలు కలిసిపోయాయి. దీనివల్ల 12 కిలోమీటర్ల పరిధిలో మూడు చోట్ల నదీ ప్రవాహానికి అడ్డుకట్టలు పడ్డాయి. 2000 సంవత్సరంలో ఏర్పడిన డ్యామ్‌లకన్నా ఈ మూడు డ్యామ్‌లు చిన్నగా ఉన్నాయి. ఇవి కాలక్రమంలో నది నీటిలో కలసిపోతాయా లేక మరింత పెద్దవవుతాయా? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని శాస్త్రవేత్తలు చెప్పారు. గ్యాలాపెరి వద్ద ఏర్పడిన డ్యామ్ 100 కోట్ల క్యూబిక్ మీటర్లు ఉందని వారు అంచనా వేశారు.
2000 సంవత్సరం, ఏప్రిల్ 9వ తేదీన మూడున్నర నుంచి 4.6 పాయింట్ల తీవ్రతతో రెండుసార్లు భూప్రకంపనలు రావడంతో నాడు కూడా భారీ ఎత్తున కొండ చెరియలు విరిగిపడి నదిలో కలసిపోయాయి. అప్పటికంటే ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అప్పుడే భారత్‌వైపు ఎక్కువ నష్టం జరిగింది. నాడు అరుణాచల్ ప్రదేశ్‌లో 50 గ్రామాలు ధ్వంసంకాగా, 30 మంది మరణించారు. వందకోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నాటి అరుణాచల్ ప్రభుత్వం అంచనావేసింది. కానీ ధ్వంసమైన అడవులకు, మట్టి మేటలు వేయడం వల్ల దెబ్బతిన్న ఆదివాసీల వ్యవసాయ భూములకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయలేదు. 17 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వ్యవసాయానికి ఆ భూములు పనికి రావడం లేదు. ఈసారి కొండ చెరియలు కూలిపోవడం వల్ల పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించక పోయినప్పటికీ భవిష్యత్తులో పెను ప్రమాదం ముంచుకొచ్చి అరుణాచల్, అస్సాం రాష్ట్రాలను ముంచేసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాంటి ముప్పును తప్పించేందుకు భారత ప్రభుత్వం, చైనా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని ‘నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్, అశోక ట్రస్ట్ ఫర్ రీసర్ట్ ఇన్ ఎకాలోజి అండ్ ఎన్విరాన్‌మెంట్’ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment