
జమ్మూ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. సాయుధులైన ఉగ్రవాదులకు, ఇద్దరు భారత సైనికుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో గాయపడిన ఇద్దరు సైనికులు మరణించారని లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ బుధవారం చెప్పారు. ఈ ఘటన మంగళ, బుధవారాల మధ్య రాత్రిలో జరిగిందన్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో చోటుచేసుకుందని తెలిపారు.
ఉగ్రవాదులతో పోరాడి మరణించిన సైనికులు నాయక్ సావంత్ సందీప్ రఘునాథ్ (29), రైఫిల్‌మ్యాన్ అర్జున్ తపా మగర్ (25)లకు దేశం రుణపడి ఉంటుందన్నారు. వీరిలో సావంత్ మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందినవ్యక్తి కాగా, అర్జున్ నేపాల్‌లోని గోర్ఖా జిల్లాకు చెందినవారు. కాల్పుల అనంతరం ఉగ్ర కదలికలు ఉన్నట్లు అనుమానించిన చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు.
‘చైనా సరిహద్దుల్లో సామర్థ్యం బలోపేతం’
చైనాతో సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొంటే.. క్రమంగా సరిహద్దు సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె పేర్కొన్నారు. దేశ ఉత్తర సరిహద్దుల్లో మిలటరీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.