ములాయం వ్యాఖ్యలపై నిర్భయ తండ్రి ఆగ్రహం
న్యూఢిల్లీ: అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయడమేంటని వ్యాఖ్యలు చేసిన సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై నిర్భయ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించని నేతలను ఎన్నుకోవద్దని నిర్భయ తల్లితండ్రులు ఓటర్లకు సూచించారు. ములాయం పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలకు రక్షణ కల్పించాలనుకునే వ్యక్తి.. కించపరిచే విధంగా మాట్లాడరని నిర్భయ తండ్రి అన్నారు.
ములాయం వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమని వారన్నారు. అత్యాచారం కేసులో నేరస్థులకు ఉరిశిక్ష విధించడం తప్పు అని, కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చట్టాలను మారుస్తామని మొరాదాబాద్ లో జరిగిన ర్యాలీలో ములాయం వ్యాఖ్యలు చేయడం వివాదస్పదమైంది. ఢిల్లీలో డిసెంబర్ 16న నిర్భయ అనే మెడికోపై అత్యాచారం జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.