షీలా దీక్షిత్ కు ఏసీబీ సమన్లు!
ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ కు అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) సమన్లు జారీ చేసింది. వాటర్ మీటర్ కుంభకోణంపై ఆమెను విచారించేందుకు, ఆమె అందించే వివరాలను విచారణాధికారులు రికార్డు చేసేందుకు వీలైన స్థలాన్ని సూచించమంటూ కోరింది.
వాటర్ మీటర్ కుంభకోణంపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను ప్రశ్నించేందుకు యాంటీ కరప్షన్ బ్రాంచ్ శ్రీకారం చుట్టింది. 341 కోట్ల వాటర్ మీటర్ అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ షీలా దీక్షిత్ కు సమన్లు జారీ చేసింది. 2014 లో ఆమ్ ఆద్మీ పార్టీ 49 రోజుల పాలనా కాలంలో వాటర్ మీటర్ల కుంభకోణంతోపాటు, అప్పట్లో నమోదైన ఎఫ్ ఐ ఆర్ ల పై దర్యాప్తునకు ఆదేశించింది. షీలా దీక్షిత్ ఢిల్లీ జల బోర్డ్ (డీజేబీ) ఛైర్ పర్సన్ గా ఉన్నసమయంలో వాటర్ మీటర్ కుంభకోణం ఆరోపణలు చోటు చేసుకోవడంతో ఆమెకు సమన్లు జారీ చేసినట్లు ఏసీబీ స్పెషల్ పోలీస్ కమిషనర్ ఎం కె మీనా తెలిపారు.
సీఆర్పీసీ సెక్షన్ 160 కింద గత శనివారం ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. వాటర్ మీటర్ కుంభకోణంపై వివరణ ఇచ్చేందుకు ఆమెకు అనువైన స్థలాన్ని సూచించమని కోరాయి.