‘చేతి’కి దెబ్బ మీద దెబ్బ
న్యూఢిల్లీ: వరుస పరాజయాలు బెడిసికొడుతున్న వ్యూహాలు.. కాంగ్రెస్‌ను ఏ విధంగానూ కోలుకోనివ్వటం లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ గెలుపులేదు. కనీసం గౌరవప్రదమైన ఓటమితోనైనా సరిపెట్టుకోలేకపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 42స్థానాలు మాత్రమే గెలిచి అవమానకరమైన పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. సాధారణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా మెరుగైన సీట్లు గెలుచుకోలేపోయింది.
తెలంగాణ ఇచ్చినందుకు 21సీట్లతో పరువు దక్కించుకున్నా, ఏపీలో జీరో అయిపోయింది. ఒడిశాలోనూ పరాజయం తప్పలేదు. ఆ తరువాత మహారాష్ట్ర, హరియాణ, ఝార్ఖండ్, జమ్ము కశ్మీర్‌లలో ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. నిజానికి 2013నుంచే కాంగ్రెస్ పతనం స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. ఆ సంవత్సరం జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కర్ణాటక మినహా ఏ పెద్ద రాష్ట్రాన్నీ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు మిగిలినవి 9 రాష్ట్రాలే. వీటిలో 5 ఈశాన్య రాష్ట్రాలే కావటం గమనార్హం.