లాయర్లకు జీతాలివ్వని ఢిల్లీ సర్కారు!
లాయర్లకు జీతాలివ్వని ఢిల్లీ సర్కారు!
Published Mon, Dec 19 2016 9:06 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
ఒకరు కాదు.. ఇద్దరు కారు.. ఏకంగా 32 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఢిల్లీ ప్రభుత్వం దాదాపు ఏడాది నుంచి జీతాలు ఇవ్వడం లేదు. ఈ విషయం ఢిల్లీ హైకోర్టుకు కూడా ఈమధ్యే తెలిసింది. ఎందుకు జీతాలు ఇంత ఆలస్యం చేస్తున్నారో వివరించాలని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖలను కోర్టు ఆదేశించింది. ప్రాసిక్యూటర్లకు ఫీజు చెల్లించకపోవడం దారుణమని, జీతాలు లేకుండా వాళ్లు తమ కార్యాలయాలను నడిపించడం, సమర్థమైన సేవలు అందించడం అసాధ్యమని జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ ఆర్‌కే గౌబాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయమై ఢిల్లీ ప్రభుత్వం ఓ నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
అయితే.. ఇదంతా కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌కు, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య ఉన్న గొడవేనని తెలుస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండానే ప్రాసిక్యూటర్ల జీతం పెంచుతూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసిందని అంటున్నారు. అయితే.. నగర పరిపాలన విషయంలో అత్యున్నత అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌దేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రాసిక్యూటర్ల జీతాల ఫైలు పెండింగులో పడింది. తర్వాత.. ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో పాటు దీన్ని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం పంపారు. దానికి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. అయితే, ఇలాంటి విషయాల్లో ఇలా చేయడం వల్ల సమర్థులైన ఇతర న్యాయవాదులు కూడా ప్రభుత్వం తరఫున వాదించడానికి వెనకాడతారని, దానివల్ల ప్రభుత్వానికే నష్టమని కోర్టు తెలిపింది.
2015 డిసెంబర్ నుంచి 32 మంది అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు జీతాలు చెల్లించలేదన్న విషయం తెలిసి తాము తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు జీతాలు ఇవ్వకపోవడానికి కారణం ఏమీ లేదన్న విషయాన్ని స్టాండింగ్ కౌన్సెల్ రాహుల్ మెహ్రా కోర్టుకు చెప్పారు.
Advertisement