కాలుష్యకారక పరిశ్రమల్ని అనుమతించకండి
డీపీసీసీని ఆదేశించిన జాతీయ హరిత ధర్మాసనం
న్యూఢిల్లీ: యుమునా నదిలోకి కాలుష్యాలను వదిలే పరిశ్రమలను ఆ పరిసర ప్రాంతాల్లో అనుమతించొద్దని జాతీయ హరిత ధర్మాసనం (ఎన్‌జీటీ)... ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీని ఆదేశించింది. ఆల్ ఇండియా లోక్ అధికార్ సంఘటన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించిన ధర్మాసనం శుక్రవారం పైవిధంగా స్పందించింది. గంగానదిలోకి కాలుష్యకారకాలను వదులుతున్న చక్కెర మిల్లుపై కొరడా ఝళిపించిన మరుసటి రోజే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
నదిలోకి నేరుగాగానీ లేదా పరోక్షంగాగానీ కాలుష్యానికి దారితీసే ఎటువంటి పరిశ్రమలను అనుమతించొద్దని జస్టిస్ పి.జ్యోతిమణి నేతృత్వంలోని ధర్మాసనం.... డీపీసీసీని ఆదేశించింది. ‘కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించే సమయంలో కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతించకూడదని మేము స్పష్టం చేస్తున్నాం. కొత్త దరఖాస్తుల పరిశీలన ప్రక్రి యను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి’ అని ధర్మాసనం పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టయితు సదరు సంస్థ యజమానిని గుర్తించి అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేసే బాధ్యత డీపీసీసీదేనంది.
గతంలోనూ ఆదేశాలు
పరిశ్రమలను త నిఖీచేసిఅవి కాలుష్యాలను వదులుతున్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించాలంటూ జాతీయ హరిత ధర్మాసనం గతంలోనూ డీపీసీసీని ఆదేశించింది. నిబంధనలను పాటించని పరిశ్రమలపై న్యా యపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సెప్టెంబర్ 10న ఎన్‌జీటీ.... డీపీసీసీని ఆదేశించిన సంగతి విదితమే. ఇందుకు స్పందించిన డీపీసీసీ...వజీర్‌పూర్ ప్రాంతంలోని అనేక పరిశ్రమలను తనిఖీ చేసింది. ఈ పరిశ్రమలన్నీ యుమనా నదిలోకి నేరుగా కాలుష్యకారకాలను వదులుతున్నట్టు గుర్తించింది. దీంతో ఆయా పరిశ్రమలకు మూసివేత నోటీసులను జారీచేసింది.