'నోరు మూసుకో లేకుంటే కాల్చిపారేస్తాం'
న్యూఢిల్లీ: తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా తెలిపారు. జేఎన్ యూ వివాదంపై మౌనం వహించకుంటే చంపుతామని ఫోన్ లో బెదిరించారని చెప్పారు. ఉదయం 8.48 గంటలకు తన ఫోన్ కు బెదిరింపు కాల్ వచ్చిందని తెలిపారు. పూజారి అని చెప్పిన వ్యక్తి తనను బెదిరించాడన్నారు.
'నోరు మూసుకో లేకుంటే కాల్చి చంపుతాం' అని హెచ్చరించాడని తెలిపారు. 'నీ దగ్గర ఎక్కువ బుల్లెట్లు ఉంటే తీవ్రవాదులను కాల్చిచంపాల'ని అతడికి సూచించానని చెప్పుకొచ్చారు. +442, +3844, +9100, +501 నంబర్ల నుంచి తన ఫోన్ కు మిస్డ్ కాల్స్ వచ్చాయన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. బెదిరింపులకు భయపడబోనని, విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటానని కపిల్ మిశ్రా స్పష్టం చేశారు.