
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఢిల్లీలోని పాఠశాలలను జూలై 31 వరకు తెరవకూడదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ‘జూలై 31 వరకు పాఠశాలల మూసివేత కొనసాగుతుంది. అయితే, ఆన్‌లైన్ క్లాసెస్‌ను నిర్వహించుకోవచ్చు’ అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శుక్రవారం తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభంపై అధికారులతో చర్చించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. విద్యార్థులపై భారం తగ్గించేందుకు సిలబస్‌ను 50% తగ్గించడం, ప్రతీ తరగతికి ప్రత్యేక ఆన్‌లైన్ యాక్టివిటీస్‌ను రూపొందించడం.. తదితర అంశాలపై వారు చర్చించారు. ‘ఒక్కో క్లాస్‌లో 12 నుంచి 15 మంది విద్యార్థులు ఉండేలా, వారానికి ఒకటి, లేదా రెండు రోజులు, రొటేషన్ పద్ధతిలో ప్రైమరీ క్లాస్‌లను నడపాలి. అవకాశమున్న ప్రతీ సందర్భంలో ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించాలి’ అనే సూచనలు ఈ సందర్భంగా వచ్చాయి. ‘కరోనాకు భయపడకుండా, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలి’ అని మనీశ్ వ్యాఖ్యానించారు.