బీజేపీ నూతన కార్యాలయంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీతోపాటు మాతృసంస్థ జనసంఘ్ ఎల్లప్పుడూ జాతి హితమే లక్ష్యంగా ఉద్యమాలు సాగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పార్టీ విజయానికి ప్రజాస్వామ్య విలువలే కారణమన్నారు. ఆదివారం ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో నిర్మించిన పార్టీ నూతన కేంద్ర కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
1951లో భారతీయ జనసంఘ్ స్థాపించిన నాటి నుంచి ఆశయ సాధనే లక్ష్యంగా సాగుతోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయి విజయవంతంగా నడిపారన్నారు. ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటూ, దేశ ప్రజల్లో కొత్త ఆశలను ఆయన నింపారని కొనియాడారు. ప్రజాస్వామ్యం మన రక్తంలోనే ఉందన్నారు. కార్యకర్తలే పార్టీ కి ఆత్మవంటి వారని పేర్కొన్నారు. ఏడాదిన్నరలోనే మూడంతస్తుల పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు కృషి చేసిన అమిత్‌షాను, ఆయన బృందాన్ని ప్రధాని మెచ్చుకున్నారు.
అతి పెద్ద కార్యాలయం: అమిత్‌షా
దాదాపు 1.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పార్టీ కొత్త కార్యాలయం ప్రపంచంలోనే అతి పెద్దది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలిపారు. కొత్త కార్యాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విశాలమైన సోషల్ మీడియా ఆఫీసు, అన్ని రాష్ట్రాల పార్టీ కార్యాలయాలతో ఆన్‌లైన్ అనుసంధానత ఉందన్నారు. దేశంలోని మొత్తం 694 జిల్లాలకు గాను 635 జిల్లాల్లో ఏడాదిలోగా పార్టీ సొంత కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీతోపాటు కేంద్ర మంత్రులు, నేతలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజధానిలోని ల్యూటెన్స్ ప్రాంతం నుంచి పార్టీ కార్యాలయాన్ని బయటకు తరలించిన మొదటి జాతీయ పార్టీ బీజేపీయే. దీంతో ల్యూటెన్స్ జోన్‌లోని నివాస ప్రాంతాల్లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నెరుపుతున్న పార్టీలపై ఒత్తిడి పెరిగినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment