రాష్ట్రంలో సీఎం ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకు రాజ్యాంగ....
ముంబై: రాష్ట్రంలో సీఎం ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకు రాజ్యాంగ చట్టబద్ధత లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. మైనారిటీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బుధవారం జరిగిన బలపరీక్షలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదని ఆరోపించారు. ఓటింగ్ నిర్వహించాల్సి ఉండగా, మూజివాణి ఓటుతో గెలిచినట్లు ప్రకటించుకోవడంలో ఔచిత్యమేమిటో ఆ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
వాస్తవానికి ఆ పార్టీ బలపరీక్షలో నెగ్గలేదని, గందరగోళం మధ్య స్పీకర్ ప్రభుత్వం బలనిరూపణలో నెగ్గిందని ప్రకటించేశారని ఆయన ఆరోపించారు. పార్టీ ప్రతినిధి బాల్ చంద్ర ముంగేకర్ మాట్లాడుతూ.. సభలో స్పీకర్ తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. మూజివాణి ఓటింగ్‌ను స్పీకర్ పూర్తిగా నిర్వహించలేదని, బీజేపీ మైనారిటీ సర్కారుకు ఎవరు మద్దతు ఇస్తున్నారో.. ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో పూర్తిగా నమోదు చేయలేదని విమర్శించారు.
కాగా, విపక్షాలు సరైన సమయంలో మూజివాణి ఓటింగ్‌కు వ్యతిరేకంగా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని బీజేపీ చేస్తున్న ఎదురుదాడిని ఆయన ఖండించారు. సీనియర్ నేత అశోక్ చవాన్ మాట్లాడుతూ.. విశ్వాస పరీక్ష సమయంలో ఓటింగ్‌కు స్పీకర్ అనుమతించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కాగా, శుక్రవారం గవర్నర్‌ను కలిసి తిరిగి విశ్వాస పరీక్ష నిర్వహించాలని కోరుతామని మాణిక్‌రావ్ ఠాక్రే పేర్కొన్నారు.